Asianet News TeluguAsianet News Telugu

కేసీఆరే ముఖ్యమంత్రి... పాలన అంతా షాడో సీఎందే: మాజీ ఎంపీ వివేక్ వ్యాఖ్యలు

దుబ్బాక ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ నేతల్లో జోష్ కనిపిస్తోంది. తెలంగాణ బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్న మాజీ ఎంపీ వివేక్ గురువారం జాతీయ మీడియా తో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

bjp leader vivek fires on kcr and ktr over ksp
Author
Hyderabad, First Published Nov 12, 2020, 7:34 PM IST

దుబ్బాక ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ నేతల్లో జోష్ కనిపిస్తోంది. తెలంగాణ బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్న మాజీ ఎంపీ వివేక్ గురువారం జాతీయ మీడియా తో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఆయన నియంతృత్వ పాలనతో ప్రజలు విసుగెత్తి పోయారన్నారు. కెసిఆర్ సీఎం అయినప్పటికీ రాష్ట్రానికి కేటీఆరే షాడో సీఎం గా వ్యవహరిస్తూ కాంట్రాక్టులు ఇచ్చిన కంపెనీల నుండి కమిషన్లు దండుకొని వేల కోట్లు వెనకేస్తున్నారని అంటూ సంచలన వాఖ్యలు చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో దేశంలోనే అతి పెద్ద కుంభకోణం జరిగిందని, ఈ విషయాలన్నింటిని ఆధారాలతో సహా అతి త్వరలో కేంద్రానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేస్తామని వివేక్ తెలిపారు.

కేసీఆర్, కేసీఆర్ కుటుంబ సభ్యుల అవినీతిపై విచారణ చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తానని, హోంమంత్రి అమిత్ షాని కలిసి కేసీఆర్ అవినీతి చిట్టా గురించి వివరించి విచారణ చేయాల్సిందిగా కోరతానని వివేక్ చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు దుబ్బాక ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత అన్నట్లు మారాయని ఆయన అభివర్ణించారు. బీజేపీ నాయకులను, కార్యకర్తలను కేసీఆర్ అనుచరగణం టార్గెట్ చేసుకొని వేధిస్తోందని, ఇలానే కొనసాగిస్తే ముఖ్యమంత్రికి ఇంకా ఎన్నో ఊహించని దెబ్బలు తగులుతాయని వివేక్ జోస్యం చెప్పారు.

దుబ్బాక ఎన్నికల ఫలితాల అనంతరం ప్రతి బీజేపీ కార్యకర్తా చురుగ్గా అయ్యాడన్నారు.  త్వరలోనే రాష్ట్రంలో బీజేపీ అత్యంత బలమైన శక్తిగా అవతరించబోతుందని, టిఆర్ఎస్ పార్టీ తగిన మూల్యం చెల్లించకతప్పదని వివేక్ హెచ్చరించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios