టీఆర్ఎస్ లో ఇంటి పోరు..హరీశ్ కు పొగబెడుతున్న కేసీఆర్: రఘునందన్ రావు
ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నేత రఘునందన్ రావు విమర్శల దాడికి దిగారు. కేసీఆర్ వంచనకు మారుపేరు అని దుయ్యబట్టారు. అల్లుడు హరీశ్‌రావును పొమ్మనలేక పొగ బెట్టినట్లు కనిపిస్తోందని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు.
మెదక్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నేత రఘునందన్ రావు విమర్శల దాడికి దిగారు. కేసీఆర్ వంచనకు మారుపేరు అని దుయ్యబట్టారు. అల్లుడు హరీశ్‌రావును పొమ్మనలేక పొగ బెట్టినట్లు కనిపిస్తోందని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. సిద్దిపేట నుంచి కేసీఆర్ పోటీ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతోందని, హరీశ్‌కు పొగబెడుతున్నారనడానికి ఇదే సాక్ష్యమని స్పష్టం చేశారు.
టీఆర్‌ఎస్‌లో ఇంటిపోరు తీవ్రమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని రఘునందన్ రావు అభిప్రాయపడ్డారు. ముందుగానే ఊహించిన కేసీఆర్ కారుకు ఉన్న4 టైర్లలో ఒక టైరు పంచరై పక్కకు పోతుందని భావించే స్టెప్నీగా సంతోష్‌ను రాజ్యసభకు తెచుకున్నారని ఎద్దేవా చేశారు.
సిద్ధిపేట నియోజకవర్గంలోని ఇబ్రహీంపూర్ గ్రామంలో జరిగిన సభలో ఇది చాలు నా మీద ఇంత గొప్పగా మీరు చూపుతున్న ఆదరాభిమానాలు ఉన్నప్పుడే రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిదనిపిస్తుంది అంటూ మంత్రి హరీశ్ రావు తన పొలిటికల్ రిటైర్మెంట్ పై చేసిన వ్యాఖ్యలపై రఘునందన్ రావు స్పందించారు.