ఇటీవలే బిజెపి జాతీయాధ్యక్షుడి సమక్షంలో బిజెపిలో చేరిన శ్రీపీఠం  పీఠాదిపతి పరిపూర్ణానంద స్వామిపై అదే పార్టీ నాయకురాలు పురందేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ సిద్దాంతాలు, ఆశయాలు నచ్చే పార్టీలో చేరారే తప్ప పదవులు ఆశించి కాదని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా కానీ, ఎంపీగాకాని పోటీ చేయరని పరందేశ్వరి స్పష్టం చేశారు. 

ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై కూడా పరందేశ్వరి మరోసారి స్పందించారు. ఓ పార్టీ నాయకుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే  రాష్ట్ర ప్రభుత్వం తమకేమీ పట్టనట్లుగా ఉండటం ఏంటని ప్రశ్నించారు. జగన్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. 

గతంలో బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై, రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పై దాడులు జరగ్గా తాజాగా జగన్ పై దాడి జరిగిందని పరందేశ్వరి తెలిపారు. ఈ దాడులతో రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంత అదుపు తప్పాయో అర్థమవుతుందని అన్నారు. జగన్ పై దాడికి పాల్పడిన వ్యక్తి మంచివాడేనంటూ పోలీసులే చెబుతున్నారని....కాబట్టి అతడి వెంట ఎవరో ఉండి ఈ పని చేయించివుంటారని  పురందేశ్వరి అభిప్రాయపడ్డారు. 

ఇక తన తండ్రి ఎన్టీఆర్ జీవిత కథాంశంతో రూపొందుతున్న సినిమాపై ఆమె స్పందించారు. కథానాయకుడిగా, రాజకీయ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా  తన తండ్రి  ఎన్టీఆర్‌ జీవితం తెరచిన పుస్తకమని...ఆయన గౌరవాన్ని దిగజార్చే విధంగా బయోపిక్‌లు ఉండకూడదని కోరుకుంటున్నట్లు పురందేశ్వరి వ్యాఖ్యానించారు.