బీజేపీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలంగాణ పర్యటన వేళ వివాదం చెలరేగింది. ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలోకి ఆయన పాదరక్షలు ధరించి వెళ్లారనే ఆరోపణలు వచ్చాయి.
బీజేపీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలంగాణ పర్యటన వేళ వివాదం చెలరేగింది. ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలోకి ఆయన పాదరక్షలు ధరించి వెళ్లారనే ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి బీఆర్ఎస్ మద్దతుదారులు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. అయితే అందులో ఎలాంటి నిజం లేదని బీజేపీ వర్గాలు స్పష్టం చేశాయి. వేములవాడ ఆలయంలో ప్రకాష్ జవదేకర్ పర్యటనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో పాటు.. ఆయన పాదరక్షలు ధరించలేదని తెలిపాయి.
వివరాలు.. కరీంనగర్‌లో బీజేపీ నిర్వహించిన పార్టీ ప్రజా సంకల్ప కార్యక్రమం ‘‘జన్ సంపర్క్ అభియాన్’’లో భాగంగా కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అనంతరం.. కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర స్థానిక నాయకులతో కలిసి వేములవాడ రాజరాజేశ్వర ఆలయాన్ని సందర్శించారు. అయితే.. ఈ క్రమంలో జవదేకర్ పాదరక్షలు తీయకుండా ఆలయంలోకి ప్రవేశించినట్టుగా విమర్శలు వచ్చాయి. ఆలయ పూజారి కోరిన తర్వాతే జవదేకర్ తన పాదరక్షలను తొలగించారని కూడా ప్రచారం జరిగింది.
టీఎస్‌ఎండీసీ చైర్మన్ క్రిశాంక్ కొన్ని వీడియోలను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసి.. బీజేపీపై విమర్శల బాణాలను సంధించారు. ‘‘బీజేపీ జాతీయ నాయకుడు ప్రకాష్ జవదేకర్‌ను గర్భగుడి దగ్గర పాదరక్షలను తొలగించాలని పూజారి కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాను రికార్డింగ్ చేయకుండా అడ్డుకున్నారు. గర్భగుడి దగ్గర పాదరక్షలు’’ అని బీజేపీపై విమర్శలు సంధించారు.
అయితే బీఆర్ఎస్ ఆరోపణలపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. టీ బీజేపీ ఐటీ విభాగం ఇంచార్జ్ వెంకట రమణ స్పందిస్తూ.. ఫేక్ న్యూస్ పెడ్లర్లు మళ్లీ పనిలో పడ్డారని విమర్శించారు. ప్రకాష్ జవదేకర్ ఆలయంలోకి ప్రవేశించే ముందు తన పాదరక్షలను తొలగించారనేది స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్లు = ఫుట్‌వేర్ చెక్కర్లు అంటూ విమర్శలు సంధించారు. అయితే బీజేపీ నేత షేర్ చేసిన ఫొటోలో ప్రకాష్ జవదేకర్ సాక్సులు ధరించి ఉన్నట్టుగా ఉంది.
