తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో .. తాము టీఆర్ఎస్ కి మద్దతు ఇవ్వడం లేదని.. బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు పేర్కొన్నారు. తమ బీజేపీ పార్టీ టీఆర్ఎస్ కి వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు.  ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన తెలంగాణ ఎన్నికల ఫలితాలపై స్పందించారు.

రాజకీయాల్లో ఆత్మహత్యలు ఉంటాయనే నానుడి ఉందని, అది కాంగ్రెస్‌కు జరుగబోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ చేసిన అనాలోచిత నిర్ణయం కారణంగా అభివృద్ధిపై జరగాల్సిన చర్చ ఆంధ్రా, తెలంగాణ సెంటిమెంట్‌పై జరిగిందని మండిపడ్డారు.రేపు (మంగళవారం) వెలువడే ఫలితాలు కాంగ్రెస్‌, టీడీపీ చెంప చెల్లుమనిపిస్తాయని జోస్యం చెప్పారు. టీపీసీపీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి గడ్డం గీసుకునే యోగం లేదని, కొందరు కాంగ్రెస్‌ నేతలకు డబుల్‌ డిజిట్‌ ఓట్లు కూడా రావని అన్నారు.

ఈ ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. ప్రజల కోసం పోరాడేది తమ పార్టీనేనన్నారు. కాంగ్రెస్ కచ్చితంగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.