పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్.  కండువా లేని టీఆర్ఎస్ నాయకులుగా పోలీసులు మారారని వివేక్ ఆరోపించారు.

మంగళవారం బెల్లంపల్లిలో విలేకరులతో మాట్లాడిన ఆయన అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో పోలీసులు పనిచేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న అక్రమాలకు, అన్యాయాలకు, అవినీతికి  పోలీసులు వంతపాడుతున్నారని ఎద్దేవా చేశారు.

టీఆర్ఎస్ నాయకులు జిల్లాలో చేస్తున్న భూకబ్జా, ఇసుక మాఫియాకు పోలీసులు సహకరిస్తూ అండగా ఉంటున్నారని వివేక్ ఆరోపించారు. ఎమ్మెల్యేలు, విప్ అండతో నాయకులు భూకబ్జాలు చేస్తున్నారన్నారని ధ్వజమెత్తారు.

టీఆర్ఎస్ నాయకుల అండతోనే గోదావరి నది నుంచి అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతోందని వివేక్ ఆరోపించారు. దీంతో వారి అవినీతి, అక్రమాలు పరాకాష్టకు చేరాయని విమర్శించారు. అధికార పార్టీ నాయకుల ప్రోత్సాహంతోనే బీజేపీ నాయకులపై  పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని వివేక్ ఆరోపించారు.

తమ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెడితే కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని మాజీ ఎంపీ హెచ్చరించారు. ఇప్పటికైనా పోలీసులు తమ పద్ధతి మార్చుకోవాలని వారికి వివేక్ హితవు పలికారు.