కాంగ్రెస్‌లో చేరుతున్నట్లుగా ప్రచారం .. క్లారిటీ ఇచ్చిన ఈటల రాజేందర్ , ఆ ఫోటోపైనా వివరణ

బీజేపీ నేత , మాజీ మంత్రి ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ జరుగుతోన్న ప్రచారంతో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి . ఓ కార్పోరేటర్ గృహ ప్రవేశ కార్యక్రమంలో అందరితో కలిసి భోజనం చేశానని, ఆ సమయంలో తీసిన ఫోటోపై దుష్ప్రచారం చేస్తున్నారని రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

bjp leader etela rajender give clarity on why he meet congress leaders ksp

బీజేపీ నేత , మాజీ మంత్రి ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ జరుగుతోన్న ప్రచారంతో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ నేతలు పట్నం మహేందర్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావుతో ఈటల వున్న ఫోటోలు వైరల్ కావడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్లయ్యింది. దీనిపై ఈటల రాజేందర్ స్వయంగా స్పందించారు. ఓ కార్పోరేటర్ గృహ ప్రవేశ కార్యక్రమంలో అందరితో కలిసి భోజనం చేశానని, ఆ సమయంలో తీసిన ఫోటోపై దుష్ప్రచారం చేస్తున్నారని రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో వున్నానని.. పార్టీ మారుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన సూచించారు. 

తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఈటల రాజేందర్ .. బీఆర్ఎస్‌లో నెంబర్ టూ స్థాయికి ఎదిగారు. అయితే కేసీఆర్‌తో విభేదాల నేపథ్యంలో ఆయన గులాబీ పార్టీని వీడి బీజేపీలో చేరారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో కేసీఆర్ వ్యూహాలను తట్టుకుని విజయం సాధించారు. అయితే తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగానే వుంటున్నారు. బీజేపీలో వున్నప్పటికీ సరైన ప్రాధాన్యత లేదని రాజేందర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌‌తోనూ ఈటలకు పడటం లేదనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. 

కరీంనగర్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేయాలని రాజేందర్ భావిస్తున్నారట. బీఆర్ఎస్‌లో వున్నప్పటి నుంచి ఆయనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంచి పట్టుంది. దీంతో తనకు ఎంపీగా అవకాశం ఇస్తే గెలుస్తానని రాజేందర్ నమ్మకంతో వున్నారు. అయితే కరీంనగర్‌లో సిట్టింగ్ ఎంపీ, తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ వున్నారు. ఆయనను కాదని కరీంనగర్‌లో రాజేందర్‌ను బరిలోకి దింపే అవకాశాలు లేవు. దీంతో మల్కాజిగిరి టికెట్ అయినా కేటాయించమని రాజేందర్ కోరుతున్నారట.. కానీ ఈ నియోజకవర్గంపై బీజేపీలోనే ఎంతో పోటీ వుంది. ఈ క్రమంలోనే రాజేందర్ పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది.. అయితే దీనికి ఆయన స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో ప్రస్తుతానికి ఈ ఇష్యూ సద్దుమణిగింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios