బయటకు చెప్పకపోయినా అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో తాను అంతర్గతంగా కొట్లాడేవాడినని మాజీ మంత్రి, బిజెపి నాయకులు ఈటల రాజేందర్ తెలిపారు. 

కరీంనగర్: తాను పదవుల కోసం పెదవులు మూసే రకం కాదని... అందవల్లే కేసిఆర్ సీఎం అయ్యాక అనేక అంశాలపై ఆయనతో పెనుగులాడానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. బయటికి చెప్పకపోయినా అంతర్గతంగా కొట్లాడేవాడినని అన్నారు. ఎలాంటి అభిప్రాయమున్న వెనక్కి తగ్గకుండి ఉన్నది ఉన్నట్లు కేసీఆర్ తో నిక్కచ్చిగా చెప్పేవాడినని అన్నారు. అవన్ని కంట్లో పెట్టుకునే తనపై కక్ష సాధించాలని చూస్తున్నాడని ఈటల అన్నారు. 

హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గ ప్రజల మధ్యలోనే వుంటున్నారు ఈటల. ఈ క్రమంలో ఇవాళ జమ్మికుంట పట్టణంలోని కృష్ణ కాలనికి చెందిన కొందరు ఈటెల రాజేందర్, మాజీ ఎంపి వివేక్ సమక్షంలో బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఈటల మాట్లాడుతూ... తాను ఎప్పటికీ పేద ప్రజల కోసం కొట్లాడే బిడ్డనని అన్నారు. ఎవరికి ఆపద వచ్చిన కో అంటే కో అనే బిడ్డను తానని అన్నారు. 

''నేను రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు సిద్దమవుతుంటే ఓడించడానికి ఎన్ని వస్తున్నాయి చూడండి. ఇంతకు ముందు పెన్షన్, రేషన్ కార్డు రావాలన్న సీఎం ఆఫీస్ కి పోవాల్సి వచ్చేది. అలాంటిది ఇప్పుడు మన దగ్గరికే అవన్ని వస్తున్నాయి. ఇవన్ని నా రాజీనామా వల్లే జరుగుతున్నాయి'' అన్నారు. 

READ MORE దళితులతోపాటు ఇతర కులాల్లోని పేదలకూ ‘బంధు’ అందించాలి: ఈటల

ఇదీలావుంటే ఇటీవల హుజురాబాద్ లో పర్యటించిన మంత్రి హరీష్ రావు తనపై చేసిన విమర్శలపై ఈటల ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యే కాకుండానే డైరెక్ట్‌గా మంత్రి అయినా హరీష్ రావుకు నా గురించి విమర్శించే హక్కు లేదన్నారు. 2001లో తాను పార్టీలో చేరే సమయానికి ప్రస్తుతం తనకున్న ఆస్తులపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. 2001లో హరీష్ రావు ఆస్తులెన్ని, ప్రస్తుతం ఆయనకు ఉన్న ఆస్తులెన్నో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

టీఆరఎస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.హుజూరాబాద్‌లో హరీష్ రావు మోసపూరిత మాటలు విమర్శిస్తున్నారు.దుబ్బాకలో కూడ మోసపూరిత మాటలు చెప్పిన హరీష్ రావుకు ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టారన్నారు. ఈ నియోజకవర్గంలో కూడ ప్రజలు టీఆర్ఎస్‌కి హరీష్ రావుకి బుద్ది చెబుతారని ఆయన చెప్పారు.