హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు బీజేపీ నేత డీకే అరుణ. తెలంగాణ రాష్ట్రాన్ని నిరంకుశంగా పాలిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ పార్టీలో లీడర్లు ఎదగకుండా కేసీఆర్ అణిచివేత ధోరణి అవలంభిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి అంటే అందులో కేంద్ర సహాయం లేకపోలేదన్నారు. కేంద్రం సహకరిస్తుంది కాబట్టే కాళేశ్వరం పూర్తైందని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని వాటిని త్వరలోనే భయటపెడతానని హెచ్చరించారు. 

ఇకపోతే తెలంంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నూతన మున్సిపల్ చట్టంపై విమర్శలు చేశారు. మున్సిపల్ చట్టం ప్రజలను భయపెట్టేలా ఉందని ఉపయోగపడేలా లేదని విమర్శించారు.  మున్సిపల్ ఎన్నికలను హడావిడిగా నిర్వహించాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. 

మరోవైపు దేశ ప్రజల తీర్పును అపహాస్యం చేసేలా కేసీఆర్ మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. మోదీ, అమిత్ షా నాయకత్వం నచ్చే ప్రజలు ఓట్లు వేశారని గుర్తుచేశారు.  తెలంగాణలో పార్టీ బలోపేతంపై అమిత్ షా దృష్టి పెట్టారని చెప్పుకొచ్చారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు డీకే అరుణ.