వనపర్తి : రాష్ట్రప్రజాధనాన్ని సీఎం కేసీఆర్ కేవలం చింతమడకకు కేటాయించడం సరికాదన్నారు బీజేపీ నేత డీకే అరుణ. ప్రజాధనం కేవలం చింతమడకకేనా ఇతర ప్రాంతాలు ఏ పాపం చేశాయని నిలదీశారు. 

చింతమడకకు ఇచ్చిన మాదిరిగానే రాష్ట్రంలోని బలహీన వర్గాలకు సీఎం కేసీఆర్ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిలదీశారు. రైతులకు రుణమాఫీ చేసి కొత్త రుణాలు ఇచ్చేలా బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. 

నిరుద్యోగభృతి, రైతులందరికీ రౌతు బంధు పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోసమే రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు పెంపు నిర్ణయం తీసుకుందన్నారు. అందులో భాగంగానే పింఛన్లు ధృవ పత్రాలు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. 

57ఏళ్లు నిండిన వారికి పింఛన్లు పింఛన్లు ఇస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు కావస్తున్నా నేటికి కొత్త పింఛన్లు మంజూరు చేయలేదని డీకే అరుణ మండిపడ్డారు. 

మరోవైపు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ లో త్రిబుల్ తలాక్ బిల్లును ఆమోదించడం అభినందనీయమన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కి ధన్యవాదాలు తెలిపారు మాజీమంత్రి డీకే అరుణ.