రాజకీయాల్లో అవుట డేటెడ్ అనేదేమీ ఉండదని  బీజేపీ నాయకుడు బాబు మోహన్ అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ నాయకుడిగా ఉన్న ఆయన కొంతకాలం క్రితం బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. కాగా... తెలుగు రాష్ట్రాల్లో  పార్టీని బలపరిచేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను కూడా చేపడుతున్నారు.

వీటిని పరిశీలించేందుకు సోమవారం బీజేపీ సీనియర్ నేత జేపీ నడ్డా ఇక్కడికి వచ్చారు. ఈ విషయంపై తాజాగా బాబు మోహన్ మీడియాతో మాట్లాడారు. తాము చేపడుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం పట్ల జేపీ నడ్డా సంతృప్తి వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. మున్సిపల్ ఎన్నికలపై దృష్టి పెట్టాలని నడ్డా తమను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.

పరిపాలించడం చేతకాక టీఆర్ఎస్ నేతలు బీజేపీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీకి క్షేత్రస్థాయిలో బలం ఉందో లేదో తెలియాలంటే... టీఆర్ఎస్ నేతలు కొద్ది రోజులు ఆగాలన్నారు. అప్పుడు వాళ్లకే నిజాలు బయటకు తెలుస్తాయని చెప్పారు. రాజకీయాల్లో అవుట్ డేటెడ్ అనేది ఉండదని అభిప్రాయపడ్డారు.

వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే కేసీఆర్, కేటీఆర్ లు అవుట్ డేటెడ్ అవుతారా అని ప్రశ్నించారు. పార్టీ ఏపని అప్పగించినా తాను కష్టపడి పనిచేస్తానని స్పష్టం చేశారు. కరీంనగర్ లో టీఆర్ఎస్ ఎంపీ ఓటమిలో తన ప్రాత ఉందని బాబు మోహన్ వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఓటమి కోసం కృషి చేస్తానని చెప్పారు.