ఎప్పటిలాగే కన్ఫ్యూజన్‌లో రాహుల్.. రహస్యపొత్తును కాపాడుకోవాలనేదే యత్నం: కిషన్ రెడ్డి ఫైర్
తెలంగాణలో యువత, నిరుద్యోగుల కోసం పోరాడుతున్నది ఒక్క బీజేపీ మాత్రమేనని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.
తెలంగాణలో యువత, నిరుద్యోగుల కోసం పోరాడుతున్నది ఒక్క బీజేపీ మాత్రమేనని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రవళిక అనే యువతి ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. పరీక్షలు వాయిదా వేయడంతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని విద్యార్థి సంఘాలు, పలువురు రాజకీయ నాయకులు ఆరోపించారు. అయితే ప్రేమ వ్యవహారం కారణంగానే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు.
అయితే ప్రవళిక ఆత్మహత్యపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. బీజేపీ, బీఆర్ఎస్‌లు ఒకటేనని విమర్శలు గుప్పించారు. ‘‘హైదరాబాద్‌లో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన వార్త చాలా బాధాకరం. ఇది ఆత్మహత్య కాదు, యువత కలలు, వారి ఆశలు, ఆకాంక్షలను హత్య చేయడమే. తెలంగాణ యువత నేడు నిరుద్యోగంతో పూర్తిగా విలవిలలాడుతోంది. గత 10 సంవత్సరాలలో.. బీజేపీ రిస్తేదార్ సమితి- బీఆర్ఎష్, బీజేపీ కలిసి వారి అసమర్థతతో రాష్ట్రాన్ని నాశనం చేశాయి. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల క్యాలెండర్‌ను విడుదల చేసి.. ఒక నెలలో యూపీఎస్సీ తరహాలో టీఎస్‌పీఎస్సీని పునర్వ్యవస్థీకరిస్తుంది. ఏడాదిలోపు ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ పోస్టులను భర్తీ చేస్తుంది - ఇది మా హామీ’’ అని రాహుల్ గాంధీ ఎక్స్(ట్విట్టర్) పేర్కొన్నారు.
అయితే రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌తో రహస్య పొత్తును కాపాడుకునేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘‘కేసీఆర్‌తో తనకున్న రహస్యపొత్తును కాపాడుకునేందుకు.. ఎప్పటిలాగే కన్ఫ్యూజన్‌లో ఉంటూ, ఏ విషయంపై స్పష్టత లేని రాహుల్ గాంధీ.. సున్నితమైన అంశంలోకి బీజేపీని లాగడం ద్వారా.. అసలు సమస్యనుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కుట్ర పన్నుతున్నాడు.
తెలంగాణలో యువత సమస్యలు, నిరుద్యోగుల ఇబ్బందులపై పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీయే. 10 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంతో, ప్రతినెలా ఠంచనుగా ఉద్యోగాలను భర్తీచేస్తూ.. ఇప్పటివరకు 6 లక్షల మంది అర్హులకు పారదర్శకమైన విధానంతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చినట్లుగానే.. మేం అధికారంలోకి రాగానే తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇస్తున్నాం. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ట్విట్టర్ ద్వారా ఇలా ఎంతకాలం పోరాడినట్లు నటిస్తారో చూడాలి!’’ అని కిషన్ రెడ్డి ఎక్స్‌లో పోస్టు చేశారు.