తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు.. : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
Hyderabad: దశాబ్దాల పాటు ఏలిన కాంగ్రెస్, బీజేపీలు అన్ని రంగాల్లో విఫలమయ్యాయని బీఆర్ఎస్ లీడర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ప్రజలు కోసం అవలంభించే ఎజెండా ఏమిటో ఇండియా కూటమి చెప్పాలని డిమాండ్ చేశారు. దక్షిణాదిన బీజేపీకి ఒక్క సీటు రాదని పేర్కొన్న ఆమె.. తెలంగాణకు బీజేపీ చేసింది శూన్యమని విమర్శించారు. తెలంగాణకు కేసీఆర్ చేసిన పనులు బీజేపీ 100 జన్మలెత్తినా చేయలేదనీ, దేశమంతా తెలంగాణ మోడల్ అమలు కోసమే బీఆర్ఎస్ గా రూపాంతరం చెందుతోందని అన్నారు.
MLC Kalvakuntla Kavitha: దశాబ్దాల పాటు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అన్ని రంగాల్లో వైఫల్యం చెందాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దెదించాలన్న ఎకైక లక్ష్యంతో పనిచేస్తున్న ఇండియా కూటమి... ప్రజల కోసం ఏమి చేస్తారో ఎజెండాను ప్రకటించాలని డిమాండ్ చేశారు. దక్షిణాదిన బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని తేచ్చిచెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తుందని తెలిపారు. తెలంగాణకు సీఎం కేసీఆర్ చేసిన పనులు బీజేపీ 100 జన్మలెత్తినా చేయలేదని అన్నారు. గురువారం నాడు చెన్నైలో ఏబీపీ నెట్వర్క్ సంస్థ నిర్వహించిన సదరన్ రైజింగ్ సమ్మిట్ లో “సార్వత్రిక ఎన్నికలు 2024: ఎవరు గెలుస్తారు ? ఎవరు ఓడుతారు ?” అన్న అంశంపై జరిగిన చర్చా వేదికలో పాల్గొని ఆమె తన అభిప్రాయాలను వెల్లడించారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కు రూపాంతరం చెందడం, ఇండియా - ఎన్డీఏ కూటములకు బీఆర్ఎస్ సమదూరంగా ఉండడం, తెలంగాణ అభివృద్ధి, బీజేపీ పక్షపాతం వంటి అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
కవిత మాట్లాడుతూ... దేశంలో భిన్నత్వం ఉందనీ, ఏదో ఒక జాతీయ పార్టీ వెంట ఉండాలన్న ప్రయోగం విఫలమైందని స్పష్టం చేశారు. నేడు దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు బలమైన శక్తిగా ఎదిగాయనీ, బీజేపీ, కాంగ్రెస్ జాతీయ పార్టీల కంటే చాలా ప్రాంతీయ పార్టీలు మంచి పనితీరును ప్రదర్శిస్తున్నాయని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో పెరిగిన వృద్ధి శాతమే అందుకు నిదర్శనమని అన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు 75 ఏళ్ల పాటు పరిపాలించే సమయం లభించినప్పుడు ఏమీ చేయలేదని విమర్శించారు. అందులో భాగంగానే జాతీయ స్థాయిలో మరో రాజకీయ శక్తిగా ఎదగాలని తమ పార్టీ భావిస్తోందనీ, తెలంగాణ తాము ఏమి చేశామో దేశమంతా విస్తరిస్తామని ప్రకటించారు. దేశమంతా తెలంగాణ అభివృద్ధి మోడల్ అమలు కావాలని ఆకాంక్షించారు. తెలంగాణలో రూ.1.2 లక్షలుగా ఉన్న తలసరి ఆదాయం గత 10 ఏళ్లలోరూ. 3.7 లక్షలకు పెరిగిందనీ, దేశంలో ఇదే అత్యధికమని స్పష్టం చేశారు. గతంలో 66 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటి సౌకర్యం ఉండేదనీ, ఇప్పుడు 2 కోట్ల ఎకరాలకు సాగునీరు అందుతోందని వివరించారు. దశాబ్దాల పాటు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజలను అసంతృప్తికి లోను చేశాయని అన్నారు. కాబట్టి తమ పార్టీ జాతీయ స్థాయిలో ఏ కూటమిలో ఉండదల్చుకోలేదని తేల్చిచెప్పారు.
తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వతంత్రంగా ఎక్కువ సీట్లు సాధించగలరనీ, బీఆర్ఎస్ మాత్రమే కాకుండా ఎవరైనా గేమ్ చేంజర్ కావచ్చని అభిప్రాయపడ్డారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఇండియా కూటమి పతనమవుతుందనీ, ఈ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ఇండియా కూటమిలోనే పార్టీల అభిప్రాయం మారవచ్చునని తెలిపారు. అయితే, ఎన్నికల తర్వాత పొత్తులు కుదుర్చుకొని ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన ఉదంతాలను మనం దేశంలో చూశామనీ, ఎన్నికల ముందు పొత్తులు చారిత్రకంగా విజయవంతం కాలేదని అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ప్రతీ పార్టీ తమతమ వ్యూహాలపై పునరాలోచిస్తాయనీ, ఇండియా కూటమిలో కొనసాగాలా లేదా స్వతంత్రంగా పోటీ చేయాలా వంటి అంశాలతో పాటు అత్యధిక సీట్లు కైవసం చేసుకోవడం వంటి అంశాలపై ఆ పార్టీలు ఆలోచన చేస్తాయని అభిప్రాయపడ్డారు.
బీజేపీని గద్దెదించాలన్నది ఇండియా కూటమి ఎకైక ఎజెండా అనీ, కానీ ప్రజల కోసం ఇండియా ఎజెండా ఏమిటి అని ప్రశ్నించారు. బీజేపీని గద్దెదించడమే ఇండియా కూటమి లక్ష్యమైతే మరి ప్రస్తుత ప్రభుత్వం కంటే ప్రజలు ఏం మెరుగైన పనులు చేస్తారని అడిగారు. బెంగాల్ లో తృణముల్ కాంగ్రెస్, కమ్యునిస్టు పార్టీలు కొట్లాడుకుంటాయనీ, కానీ ఆ రెండు పార్టీలు ఇండియా కూటమిలో ఉన్నాయని, కేరళలో కాంగ్రెస్, సీపీఎం మధ్య పోరు, పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు తలపడుతాయని, మరి ఇలాంటప్పులు సీట్లను ఎలా పంచుకుంటారని ప్రశ్నించారు. ఇది నిజమైన పొత్తలుని ప్రజలకు ఎలా విశ్వాసం కల్పిస్తారని అడిగారు. తెలంగాణకు మోదీ ప్రభుత్వం చేసిన శూన్యమని ధ్వజమెత్తారు. తెలంగాణకే కాకుండా తమిళనాడు వంటి రాష్ట్రాలకు కూడా బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. మధురై ఎయిమ్స్ గత 8 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. బీజేపీ దృష్టిమళ్లింపు రాజకీయాలు చేస్తోందనీ, అవి కొన్ని సార్లు పనిచేశాయని, కానీ మళ్లీమళ్లీ పనిచేయబోవని విశ్లేషించారు. 2026 తర్వాత జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలు సీట్లు కోల్పోతాయనీ, దీనిపై బీజేపీ వైఖరి ఏమిటని ఆ పార్టీ తమిళనాడు అధ్యక్షుడు అన్నమలైను ప్రశ్నించారు. ఈ అంశంపై ప్రజలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.