Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ స‌ర్కస్ కంపెనీలా మారింది - పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి

బీజేపీ సర్కస్ కంపెనీలా వ్యవహరిస్తోందని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీపై తీవ్రంగా విమర్శలు చేశారు. 

BJP has become a circus company - PUC Chairman, MLA Jeevan Reddy
Author
Hyderabad, First Published Jan 11, 2022, 6:17 PM IST

తెలంగాణ‌లో గడిచిన పది రోజుల్లో బీజేపీ (bjp) రాజ‌కీయ పార్టీలా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని, సర్క‌స్ కంపెనీలా మారింద‌ని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి (mla jeevan reddy) అన్నారు. చిన్న‌ప్పుడు తాము బాంబే సర్కస్ కంపెనీ అని విన్నామ‌ని ఇప్పుడు బీజేపీ దానిని మించిపోయింద‌ని తీవ్రంగా విమ‌ర్శించారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించి బీజేపీపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు స‌ర్క‌స్ కంపెనీ షోలు నిర్వ‌హిస్తుంటే అందులో ఆ పార్టీ సీఎంలు, జాతీయ నాయకులు ఆర్టిస్టులు, జోకర్లుగా మారార‌ని ఎద్దేవా చేశారు. ఒక వార్డు మెంబ‌రుగా గెలువ‌లేని ఆ పార్టీ జాతీయ నేత మురళీధర్ రావు కూడా సీఎం కేసీఆర్ ను అవినీతిపరుడు అంటున్నార‌ని తెలిపారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతి జ‌రిగింద‌ని ఆరోపిస్తూ సీఎంను జైలు కు పంపుతామంటున్నారని అన్నారు. అయితే కాళేశ్వ‌రం లో ఎలాంటి అవినీతి జ‌ర‌గలేద‌ని రేవంత్ రెడ్డి పార్ల‌మెంటులో అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్ర ప్ర‌భుత్వ‌మే స‌మాధానం చెప్పింద‌ని గుర్తు చేశారు. 

కేసీఆర్ ఉద్యమ కారుడ‌ని, ఆయ‌న‌ను ట‌చ్ చేస్తే తెలంగాణతో పాటు దేశం అగ్ని గుండంగా మారుతుంద‌ని  ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి అన్నారు. బీజేపీ మధ్య ప్రదేశ్ ఇంచార్జీ గా ఉన్న మురళీధర్ రావు ఒక్క సారి కూడా రాష్ట్రానికి కూడా వెళ్లలేర‌ని అన్నారు. శివరాజ్ సింగ్ చౌహన్ దొంగ దారిన సీఎం అయ్యార‌ని ఆరోపించారు. అసోం సీఎం హేమంత్ బిశ్వా శర్మ కాంగ్రెస్ లో బీజేపీ కోవర్టుగా ఉన్నాడ‌ని త‌రువాత బీజేపీలో చేరి ముఖ్య‌మంత్రి అయ్యారని విమ‌ర్శించారు. బిశ్మా శ‌ర్మ చేసే త‌ప్పుడు ప్ర‌చారాల వ‌ల్ల  ఫేస్ బుక్ గ‌తంలో ఒక సారి ఆయ‌న అకౌంట్ ను బ్యాన్ చేసింద‌ని ఆరోపించారు. అలాంటి వ్య‌క్తులు సీఎం కేసీఆర్ పై ఆరోప‌ణ‌లు చేయ‌డం ఏంటని అన్నారు. 

బీజేపీ నేతలకు కళ్ళు లేవ‌ని అందుకే తెలంగాణ అభివృద్ధి కనిపించడం లేదని విమ‌ర్శించారు. తెలంగాణ మహారాష్ట్ర స‌రిహ‌ద్దు గ్రామాల ప్ర‌జ‌లు నిల‌దీస్తార‌నే ఉద్దేశంతోనే మాజీ సీఎం ఫడ్నవీస్ మహబూబ్ నగర్ స‌భ‌కు రాలేద‌ని ఆరోపించారు. సంక్రాంతి పండ‌గ‌కు గంగిరెద్దులోల్లు వ‌చ్చిన‌ట్టు వేరే రాష్ట్రాల నుంచి బీజేపీ నాయ‌కులు తెలంగాణ‌కు వ‌చ్చి అబ‌ద్దాలు చెబుతున్నార‌ని అన్నారు. తెలంగాణ‌లో బీజేపీకి న‌లుగురు ఎంపీలు ఉన్నా.. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేయ‌లేద‌ని విమ‌ర్శించారు. రైల్వే ప్రాజెక్టు ల్లో రాష్ట్రానికి అన్యాయొం జ‌రుగుతున్నా వారు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. తెలంగాణ‌లో అమ‌లవుతున్న ప‌థ‌కాల‌ను ఇప్పుడు ఎన్నిక‌లు జ‌రిగే రాష్ట్రాల్లో బీజేపీ మేనిఫెస్టోలో పెట్టాల‌ని తెలిపారు. ఉచిత విద్యుత్ ఇచ్చే దమ్ము బీజేపీకి ఉందా అని ప్ర‌శ్నించారు. 

కేసీఆర్ లాంటి నాయ‌కుడిని హేమంత్ బిశ్వ శర్మ లాంటి వ్య‌క్తి అరెస్టు చేస్తామంటే రాష్ట్ర ప్ర‌జ‌లు చూస్తూ ఊరుకోర‌ని అన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర లోని స‌రిహ‌ద్దు గ్రామాలు తెలంగాణాలో క‌లుస్తామ‌ని కోరుతున్నాయ‌ని చెప్పారు. అస‌రమైతే సీఎం కేసీఆర్ యూపీలో బీజేపీకి వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేస్తార‌ని, సీఎం ఆదేశిస్తే తాము కూడా ప్ర‌చారం చేస్తామ‌ని అన్నారు. రేవంత్ రెడ్డి హుజూరాబాద్ ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీ ద‌గ్గ‌ర సుపారీ తీసుకున్నార‌ని తెలిపారు. గ‌తంలో ఒక సారి ఎమ్మెల్యేల‌ను కొన‌డానికి చంద్ర‌బాబు నాయుడు ద‌గ్గ‌ర సుపారీ తీసుకున్నార‌ని ఆరోపించారు. సుపారీలు ,సెటిల్ మెంట్లు, దందాలు, బ్లాక్ మెయిల్ లు రేవంత్ కు అలావాటే అని తీవ్రంగా విమ‌ర్శించారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios