Asianet News TeluguAsianet News Telugu

ఉచితాల‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించాలి: మంత్రి హ‌రీశ్ రావు

ఉచితాలు వద్దని అనుచిత వ్యాఖ్యలు చేసే బీజేపీ ప్ర‌భుత్వాన్ని గద్దె దించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని హరీశ్​ రావు అన్నారు.

Bjp Government At The Center Should Be Ousted Says Harish Rao
Author
Hyderabad, First Published Aug 25, 2022, 6:20 AM IST

ఉచితాలు వద్దని అనుచిత వ్యాఖ్యలు చేసే బీజేపీ కేంద్ర‌ ప్రభుత్వాన్ని గద్దె దించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. రాజకీయ ప్రయోజనాల కోసం.. ప్ర‌శాంతంగా, సోద‌ర‌భావంతో ఉన్న‌ ప్రజల మధ్య చిచ్చు పెట్టే పార్టీలకు బుద్ది చెప్పాలని అన్నారు. మెదక్ మున్సిపాలిటీ పరిధి పిల్లి కొట్టాల్ లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను మంత్రి హ‌రీష్ రావు  బుధ‌వారం ప్రారంభించారు. ఈ స‌మ‌యంలో 561 ఇళ్ల పట్టాలను అందచేశారు.

ఈ సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో మంత్రి హ‌రీశ్ రావు మాట్లాడుతూ..  తెలంగాణలో తప్ప ఏ ఇత‌ర రాష్ట్రాల్లో రూ.2016 పెన్షన్ ఇవ్వడం లేదని అన్నారు. తెలంగాణలో జరిగే అభివృద్ధిని చూడ‌లేక‌.. బీజేపీ కుట్రలు చేస్తోందని, ప్రజల మధ్య చిచ్చు పెట్టే మ‌త ఘ‌ర్ష‌ణ‌ల‌కు సృష్టిస్తోంద‌ని ఆరోపించారు.  తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల అభివృద్ది కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంద‌నీ, ఇతర రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ఇలాంటి ప‌థ‌కాల‌ను ఎందుకు అమ‌లు చేయ‌డం లేద‌ని  ప్రశ్నించారు. ఎవ‌రూ ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేసినా..  తెలంగాణ అభివృద్దిని అడ్డుకోలేరని అన్నారు.  

గ్యాస్ సబ్సిడీ గురించి మాట్లాడుతూ కేంద్రంపై విరుచ‌క‌ప‌డ్డారు. నిరుపేదలకు గ్యాస్ ఇవ్వడం చేతకాని ప్రభుత్వం మోడీ ప్రభుత్వమని, నిత్యం గ్యాస్ రేట్ల‌ను పెంచి.. పేద‌ల బ‌తుకు భారం చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 10 లక్షల కోట్లను బడా కంపెనీలకు అప్ప‌న్నంగా కట్టబెట్టిందనీ, కానీ, పేదలకు చేసిందేమీ లేదని, వారిపై ప‌న్నుల భారాన్ని మోపుతుంద‌ని అన్నారు. 

దేశంలో 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే... తెలంగాణ రాష్ట్రానికి ఒక్క మెడిక‌ల్ కాలేజీ కూడా ఇవ్వ‌లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎన్నిసార్లు విజ్ఞ‌ప్తి చేసినా.. ఇప్ప‌టివ‌రకూ కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలు మంజూరు  చేయలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి 60 వేలు ఇస్తే.. అందులో 40 వేలు తిరిగి చెల్లించాల్సి వ‌చ్చేంద‌నీ,  20 వేల రూపాయల మాఫీ కోసం  బ్యాంకుల చూట్టు ప‌లు మార్లు తిర‌గాల్సి వ‌చ్చేంద‌ని, అంతేగాక కాంగ్రెస్ నాయకులు లంచాలు తీసుకునేవారని ఆరోపించారు.

నేడు తెరాస ప్రభుత్వం.. పేదలకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా డబుల్ బెడ్ రూం ఇండ్ల‌ను  కట్టి ఇస్తుంద‌నీ, ప్ర‌జా సంక్షేమాన్ని కోరుకునే తెరాస‌ ప్రభుత్వాన్ని ఆదరించాలనీ, సీఎం కేసీఆర్ ను మ‌రోసారి ఆశీర్వదించాలని మంత్రి హ‌రీశ్ రావు కోరారు. తెలంగాణలో అమలవుతున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల స్కీమ్ దేశంలోని ఏ రాష్ట్రంలో లేదన్నారు.

అలాగే.. మంత్రి హ‌రీశ్ రావు.. సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలంలోని రామంచలో 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదామును ప్రారంభించారు. అనంతరం టీహెచ్ఆర్ పల్లె ప్రకృతి వనం, మంకీ ఫుడ్ కోర్టును ప్రారంభించారు. అనంత‌రం నూతనంగా నిర్మించిన‌ గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు.

Follow Us:
Download App:
  • android
  • ios