బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో కుమార స్వామి సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోవడం, బీజేపీ బలనిరూపణ పరీక్షలో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి పి. మురళీధర్ రావు. భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, కర్ణాటక రాష్ట్ర ఇంచార్జ్ గా అక్కడే ఉంటూ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్నారు మురళీధర్ రావు.

కేంద్ర నాయకత్వానికి అత్యంత దగ్గరగా ఉండే మురళీధర్ రావు కర్ణాటకలో కుమార స్వామి ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి బీజేపీ అనుసరించిన వ్యూహాలలో పి మురళీధర్ రావు కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.  

2024లో దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్రమోదీలు ఆ బాధ్యతలను తెలుగువాళ్లు అయిన పి.మురళీధర్ రావుకు అప్పగించారు. అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతం చేయాల్సిందిగా మరో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ కూడా అప్పగించారు. 

బీజేపీ అగ్రనేతలుగా వెలుగొందుతున్న ఈ నేతలు తెరవెనుక రాజకీయం చేయడంలో సిద్ధహస్తులు. ఢిల్లీలో రామ్ మాధవ్ రాజకీయాల్లో చక్రం తిప్పుతుంటే కర్ణాటక రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో పార్టీ బాధ్యతలు ఇంచార్జ్ గా పి.మురళీధర్ రావుకు అప్పగించింది. 

కర్ణాటక సంక్షోభం ప్రారంభమైన మూడు వారాల నుంచి మురళీధర్ రావు బెంగళూరులోనే తిష్టవేశారు. అప్పుడప్పుడు సొంతరాష్ట్రమైన తెలంగాణ వస్తున్నప్పటికీ దృష్టి అంతా మాత్రం కర్ణాటకపైనే ఉండేది. 

కర్ణాటలకలో సంకీర్ణ ప్రభుత్వం ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఎప్పటికప్పుడు రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లడం ప్రత్యామ్నాయ మార్గాలు చూపడంలో కీలక పాత్ర పోషించారు మురళీధర్ రావు.