బండి సంజయ్ రిమాండ్ రద్దు: తెలంగాణ హైకోర్టులో బీజేపీ లంచ్ మోషన్ పిటిషన్
టెన్త్ క్లాస్ పేపర్ లీక్ కుట్ర కేసులో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై రిమాండ్ ను రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది బీజేపీ .
హైదరాబాద్: బండి సంజయ్ రిమాండ్ ను రద్దు చేయాలని బీజేపీ గురువారంనాడు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. హన్మకొండ కోర్టు విధించిన రిమాండ్ రద్దు చేయాలని ఆ పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని బీజేపీ తరపు న్యాయవాదులు హైకోర్టును కోరారు.మధ్యాహ్నం ఒంటిగంటకు విచారణకు జరిపేందుకు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయన్ అంగీకరించారు.
టెన్త్ క్లాస్ పేపర్ లీక్ అంశంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను ఏ1 గా వరంగల్ సీపీ రంగనాథ్ ప్రకటించారు. రాష్ట్రప్రభుత్వాన్ని అప్రతిష్టపాలుచేసేందుకు టెన్త్ క్లాస్ పేపర్ లీక్ కు ప్లాన్ చేశారని పోలీసులు ప్రకటించారు. ఈ విషయమై బండి సంజయ్ డైరెక్షన్ లో కుట్ర జరిగిందని పోలీసులు ప్రకటించారు. నిన్న సాయంత్రం బండి సంజయ్ ను హన్మకొండ మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హజరుపర్చారు.