Asianet News TeluguAsianet News Telugu

వరంగల్ వెస్ట్‌‌ బీజేపీలో అసమ్మతి స్వరం .. టికెట్ దక్కకపోవడంతో రాకేష్ రెడ్డి అలక, ఇండిపెండెంట్‌గా బరిలోకి..?

వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అసెంబ్లీకి గాను తొలి విడతలోనే అభ్యర్ధిని ప్రకటించారు. నాటి నుంచి ఇక్కడ బీజేపీలో అంతర్గత కలహాలు మొదలయ్యాయి. ఈ నియోజకవర్గం నుంచి టికెట్ వస్తుందని ఆశించిన ఆ పార్టీ అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డిని అధిష్టానం పక్కనబెట్టింది. 

BJP faces dissent in Warangal West ksp
Author
First Published Oct 26, 2023, 3:28 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు దూసుకెళ్తున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్ధులు ఇప్పటికే తొలి రౌండ్ ప్రచారం చేయగా.. ఆ పార్టీ తరపున సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బస్సు యాత్ర నిర్వహించారు. అయితే బీజేపీలో మాత్రం ఆ స్థాయి దూకుడు కనిపించడం లేదు. దీనికి తోడు కీలక నేతలు పార్టీని వీడటంతో కమల దళంలో జోష్ తగ్గింది. టికెట్ దక్కని ఆశావహులు అలకబూనడం ఆ పార్టీకి మరిన్ని తలనొప్పులు తెచ్చిపెడుతోంది. 

వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అసెంబ్లీకి గాను తొలి విడతలోనే అభ్యర్ధిని ప్రకటించారు. నాటి నుంచి ఇక్కడ బీజేపీలో అంతర్గత కలహాలు మొదలయ్యాయి. ఈ నియోజకవర్గం నుంచి టికెట్ వస్తుందని ఆశించిన ఆ పార్టీ అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డిని అధిష్టానం పక్కనబెట్టింది. దీంతో ఆయన వర్గం మండిపడుతోంది. గతంలో 2014 ఎన్నికల సమయంలో వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసిన అభ్యర్ధి రావు పద్మకు వరంగల్ పశ్చిమ టికెట్ కేటాయించడంపై అసంతృప్తిగా వున్నట్లుగా సమాచారం. బిట్స్ పిలానీలో గ్రాడ్యుయేషన్ చేసిన రాకేష్ రెడ్డికి టికెట్ నిరాకరించడం ఆయన మద్ధతుదారుల్లో నైరాశ్యాన్ని రేకెత్తించింది. గత ఐదేళ్లుగా అనేక కార్యక్రమాల ద్వారా పార్టీలో ఐక్యతను పెంపొందించేందుకు కృషి చేసినప్పటికీ తనకు అన్యాయం జరిగిందని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

అయితే రాకేష్ రెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చేసే ఆలోచనలో వున్నారని సన్నిహితులు చెబుతున్నారు. ఈ మేరకు త్వరలో తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం వుంది. అటు బీజేపీ నిర్ణయాలు ఆ పార్టీలో వివాదాన్ని రేకెత్తిస్తున్నాయి. అభ్యర్ధి సామర్ధ్యాన్ని బట్టి టికెట్లు కేటాయించాలని పలువురు సూచిస్తున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ ఉనికిని బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించిన రెడ్డిని పక్కనబెట్టడం మాత్రం కరెక్ట్ కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. వరంగల్ పశ్చిమలో కాంగ్రెస్ పార్టీ నాయిని రాజేందర్ రెడ్డిని నిలబెట్టగా.. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌కు మరోసారి అవకాశం కల్పించింది. దీంతో బీజేపీ మూడో స్థానానికి పరిమితమయ్యే అవకాశాలు వున్నాయని సొంత పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios