Asianet News TeluguAsianet News Telugu

జీహెచ్‌ఎంసీ ఆఫీసు ముందు బీజేపీ కార్పొటరేటర్ల ఆందోళన.. అదుపులోకి తీసుకున్న పోలీసులు..

హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ  కార్యాలయం ముందు బీజేపీ కార్పొరేటర్లు ధర్నాకు దిగారు. జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని అర్ధంతరంగా వాయిదా వేశారని, ఎలాంటి చర్చ లేకుండా బడ్జెట్‌ను ఆమోదించారని బీజేపీ కార్పొరేటర్లు మేయర్ గద్వాల విజయలక్ష్మిపై మండిపడుతున్నారు.

BJP Corporators Protest At infront of GHMC Office
Author
First Published Dec 24, 2022, 4:08 PM IST

హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ  కార్యాలయం ముందు బీజేపీ కార్పొరేటర్లు ధర్నాకు దిగారు. జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని అర్ధంతరంగా వాయిదా వేశారని, ఎలాంటి చర్చ లేకుండా బడ్జెట్‌ను ఆమోదించారని బీజేపీ కార్పొరేటర్లు మేయర్ గద్వాల విజయలక్ష్మిపై మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే జీహెచ్‌ఎంసీ కార్యాలయం ముందుకు నిరసనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు.. సేవ్ డెమోక్రసీ ప్లకార్డులు పట్టుకుని మేయర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ప్రజాసమస్యలపై చర్చించకుండా.. మేయర్ ఏకపక్షంగా బడ్జెట్‌ను ఆమోదించుకున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా నియంత మాదిరిగా వ్యవహరిస్తోందో.. జీహెచ్ఎంసీలో కూడా అదే మాదిరి పరిస్థితులు ఉన్నాయని మండిపడ్డారు. జీహెచ్‌ఎంసీలో ఏ ఒక్క సమస్య పరిష్కారం కావడం లేదని ఆరోపించారు. 

బీజేపీ కార్పొరేటర్ల ఆందోళన నేపథ్యంలో ఆ మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం  ఏర్పడింది. అయితే ఆందోళన చేస్తున్న బీజేపీ కార్పొరేటర్లను అదుపులోకి తీసుకన్న పోలీసులు.. అక్కడి నుంచి వారిని తరలించారు. మరోవైపు కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా మేయర్ విజయలక్ష్మి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ ఛాంబర్ ముందు కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆందోళన చేశారు. 

ఇదిలా ఉంటే.. ఈ రోజు ఉదయం జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశాలు ప్రారంభమైనప్పటీ నుంచే తీవ్ర గందరగోళం నెలకొంది. సభలో విపక్ష కార్పొరేటర్ల ఆందోళనల మధ్యనే రూ. 6,624 కోట్ల 2023-2024 వార్షిక బడ్జెట్‌కు జీహెచ్‌ఎంసీ పాలకమండలి ఆమోదం తెలిపింది. విపక్ష సభ్యుల గందరగోళం మధ్యే బడ్జెట్‌కు ఆమోదం తెలిపినట్టుగా మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రకటించారు. ఈ రోజు ఉదయం జీహెచ్‌ఎంసీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయిన వెంటనే.. సభలో గందరగోళం నెలకొంది. సమావేశాలను బీజేపీ కార్పొరేటర్లు అడ్డుకున్నారు.  నగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, కాంట్రాక్ట్ పెండింగ్ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే మేయర్ వారిని వారించే ప్రయత్నం చేశారు. 

మరోవైపు బడ్జెట్ ఆమోదం పొందినట్టుగా మేయర్ ప్రకటించడంపై.. బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఎలాంటి చర్చ లేకుండానే బడ్జెట్‌కు ఆమోదంపై విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే సభలో బీజేపీ, టీఆర్ఎస్‌ కార్పొరేటర్లు పోటాపోటీగా నినాదాలు చేశారు. మేయర్ డౌన్ డౌన్ అంటూ బీజేపీ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ కార్పొరేటర్ల తీరుపై మేయర్ గద్వాల విజయలక్ష్మీ సీరియస్ అయ్యారు. 

ఇదేనా మహిళకు ఇచ్చే గౌరవం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పొడియం వద్దకు వచ్చిన సభ్యులు వారి స్థానాల్లోకి వెళ్లాలని మేయర్ సూచించారు. మేయర్ పోడియం దగ్గరకు రావడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చలు జరగాలి అనుకుంటే అందరూ సహకరించాలన్నారు. బీజేపీ సభ్యులను బయటకు పంపాలని మార్షల్స్ ను ఆదేశించారు. పరిస్థితులు అలాగే కొనసాగడంతో జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశాలను మేయర్ విజయలక్ష్మి ముగించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios