తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇవాళ వెలువడ్డ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ హేమాహేమీ నాయకులు ఓటమిపాలయయ్యారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జానా రెడ్డి, డికె.అరుణ, రేవంత్ రెడ్డి,  పొన్నం ప్రభాకర్, దామోదర రాజరనర్సింహ  వంటి వారు కూడా ఓటమిపాలయ్యారు. తాజాగా ఇలా ఓడిన నాయకుల జాబితాలోకి మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ చేరారు. 

గోషా మహల్ నియోజవర్గం నుండి కాంగ్రెస్ తరపున ఫోటీకి దిగిన ముఖేష్ గౌడ్, బిజెపి తాజా మాజీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు కనీస పోటీ ఇవ్వలేకపోయారు. ఈ స్థానం నుండి రాజా సింగ్ సమీప టీఆర్ఎస్ అభ్యర్థి ప్రేమ్ సింగ్ రాథోడ్ పై ఆరు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ముఖేష్ గౌడ్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. 

ఈ నెల 7వ తేదీన తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఓట్ల లెక్కింపు ఇవాళ ఉదయం నుంచి జరుగుతోంది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ విజయం సాధించింది. దీంతో తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడనుంది. ముఖ్యమంత్రిగా మరోసారి కేసీఆర్ రాష్ట్ర పగ్గాలు చేపట్టనున్నారు.