తెలంగాణలో జరుగుతున్న అక్రమ అరెస్టులు, దాడులు, నిర్బంధాలపై బీజేపీ నేడు నిరసన దీక్షకు పిలుపునిచ్చింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టాలని నిర్ణయించింది.
తెలంగాణలో జరుగుతున్న అక్రమ అరెస్టులు, దాడులు, నిర్బంధాలపై బీజేపీ నేడు నిరసన దీక్షకు పిలుపునిచ్చింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలను విజయవంతం చేయాలని బీజేపీ శ్రేణులకు బండి సంజయ్ పిలపునిచ్చారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్నారు. దీంతో బండి సంజయ్ కరీంనగర్‌లోని ఆయన నివాసంలోనే దీక్ష చేపట్టననున్నారు. ఇక, ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్న బండి సంజయ్.. బుధవారం ఉదయం పోలీసులు అనుమతితో మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఓ వైపు బండి సంజయ్ ఇంటికి ఆయనకు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉండటం.. మరోవైపు టీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆయన ఇంటి ముట్టడికి యత్నించే అవకాశం ఉండటంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
మరోవైపు ప్రజా సంగ్రామ యాత్ర నిలిపివేతపై బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించనున్నారు. హైకోర్టులో లంచ్ మోహన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర కొసాగించేందుకు అనుమతులు ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరనున్నారు. కోర్టు నుంచి అనుమతి వస్తే.. బండి సంజయ్ కరీంనగర్ నుంచి నేరుగా జనగామ వెళ్లనున్నారు.
అసలేం జరిగిందంటే..?
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రేమయం ఉందంటూ బీజేపీ నేతలు ఆరోపణలు చేయడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవిత నివాసాన్ని ముట్టడించేందుకు బీజేపీ కార్యకర్తలు యత్నించారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. అయితే బీజేపీ కార్యకర్తలపై పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే మంగళవారం జనగామ జిల్లాలోని పామ్నూర్‌లో పాదయాత్ర శిబిరం వద్ద పోలీసులు బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారు. ముందస్తుగా ఆయనను అరెస్ట్ చేసిన కరీంనగర్‌కు తరలించారు. అయితే బండి సంజయ్‌ను అరెస్ట్ చేస్తున్న సమయంలో.. పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.
మరోవైపు ప్రజా సంగ్రామ యాత్ర ఆపాలని బండి సంజయ్ కు వరంగల్ పోలీసులు మంగళవారం రోజు నోటీసులు పంపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వర్ధన్నపేట ఏసీపీ బండి సంజయ్ కు నోటీసులు పంపారు. పాదయాత్రలో విద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ యాత్ర ఇలానే కొనసాగితే శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందని పోలీసులు అభిప్రాయపడ్డారు. పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తే చట్టపరమైన చర్యలు తీసుకొంటామని పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు. పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు.
ఇక, బండి సంజయ్ అరెస్టు, ప్రజా సంగ్రామయాత్ర నిలిపివేతపై బీజేపీ నేతలు మంగళవారం రాజ్ భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను కలిశారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగించేందుకు అనుమతించాలని, దానికి భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను బీజేపీ నేతలు కోరారు.
