హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బలోపేతం కావడానికి బీజేపీ వేస్తున్న అడుగులు టీఆర్ఎస్‌ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి సరైన పట్టు లేనందున ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించే అవకాశం ఉండదని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో తమకు గ్రామాల్లో శాఖలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ, రాష్ట్రంలో బీజేపీకి కేవలం 20 శాతం మాత్రమే బీజేపీకి శాఖలు  ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

గత ఏడాది డిసెంబర్ మాసంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకొంది.కానీ, ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకొంది.

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి  కేవలం 7.15 శాతం ఓట్లు వచ్చాయి. కానీ, ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి 19.65 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ మూడు ఎంపీ సీట్లను దక్కించుకొంది.కాంగ్రెస్ పార్టీకి 29.79 శాతం ఓట్లు వచ్చాయి.

గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 88 అసెంబ్లీ సీట్లు దక్కాయి. టీఆర్ఎస్ కు 47.38 శాతం ఓట్లు వచ్చాయి.ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 41.71 ఓట్లు వచ్చాయి.

తెలంగాణ రాష్ట్రంలో తాము ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతున్నామని బీజేపీ చేస్తున్న ప్రచారం తప్పని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. బీజేపీ నేతలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. తప్పుడు ప్రచారం ద్వారానే బీజేపీ రాష్ట్రంలో ఎదిగేందుకు ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.

ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో  టీడీపీ, కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీల నుండి నేతలు బీజేపీలో చేరుతున్నారు. త్వరలోనే మరికొంత మంది కీలక నేతలు కూడ బీజేపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.