Asianet News TeluguAsianet News Telugu

బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి నిరాకరణ.. హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ..

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర ప్రారంభంపై సస్పెన్స్ కొనసాగుతుంది. పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. 

BJP Approach High Court For Denying permission For Bandi Sanjay Padayatra
Author
First Published Nov 28, 2022, 9:18 AM IST

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర ప్రారంభంపై సస్పెన్స్ కొనసాగుతుంది. పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. నిర్మల్ పోలీసులు కావాలనే పాదయాత్రకు అనుమతి నిరాకరించారని పిటిషన్‌లో పేర్కొంది. వారం రోజుల క్రితం అనుమతి ఇచ్చి.. ఇప్పుడు కావాలనే రద్దు చేసినట్టుగా ఆరోపించింది. అయితే కోర్టు అనుమతి ఇస్తేనే బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇక, షెడ్యూల్ ప్రకారం బండి సంజయ్ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర నేడు భైంసాలో ప్రారంభం కావాల్సి ఉంది. అక్కడ బహిరంగ సభ నిర్వహించేందుకు కూడా బీజేపీ ప్లాన్ చేసింది. ఈ సభకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా హాజరుకావాల్సి ఉంది. అయితే పాదయాత్రను ప్రారంభించేందుకు నిర్మల్‌కు వెళుతుండగా ఆదివారం సాయంత్రం జగిత్యాల జిల్లా వెంకటాపూర్ పోలీసులు బండి సంజయ్‌ను అడ్డుకున్నారు. పాదయాత్రకు, సభకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో పోలీసులు ఆయనను అడ్డుకున్నట్టుగా చెప్పారు. 

ఈ క్రమంలోనే పోలీసులకు, బండి సంజయ్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగింది. పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగా బండి సంజయ్ పాదయాత్రకు అడ్డంకులు కల్పిస్తున్నారని బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆరోపించారు. అనంతరం బండి సంజయ్‌ను ఆయన వాహనంలోనే కరీంనగర్‌లోని ఆయన నివాసానికి తరలించారు. 

భైంసా మతపరమైన సున్నితమైన పట్టణం కావడంతో బండి సంజయ్ పాదయాత్రకు, బహిరంగ సభకు అనుమతి నిరాకరించినట్టుగా పోలీసులు తెలిపారు. భైంసా సున్నిత ప్రాంతమని, శాంతి భద్రతల దృష్ట్యా బీజేపీ చేపట్టిన పాదయాత్ర, బహిరంగ సభకు పోలీసు శాఖ నుంచి ఎలాంటి అనుమతి లేదని నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. జిల్లాలో 30 పోలీసు యాక్ట్ అమల్లో ఉందని చెప్పారు. 

ఇక, బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యూల్ ప్రకారం.. ఐదు జిల్లాల్లోని మూడు లోక్‌సభ, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 రోజుల పాటు 220 కిలోమీటర్ల మేర యాత్ర సాగాల్సి ఉంది. డిసెంబర్ 17న కరీంనగర్‌లో పాదయాత్ర ముగిసేలా షెడ్యూల్‌ను రూపొందించారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలలో బహిరంగ సభ నిర్వహించాలని భావించారు.

అయితే పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ.. పాదయాత్రను కొనసాగిస్తామని బీజేపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. శాంతియుతంగా పాదయాత్రను కొనసాగిస్తానని బండి సంజయ్ స్పష్టం చేస్తున్నారు. పాదయాత్ర చేపట్టేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం రాష్ట్రంలో కొనసాగుతున్న నియంత పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios