హైదరాబాద్:తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని నిరూపించుకొనేందుకు కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడేందుకు సిద్దమయ్యాయి. కాంగ్రెస్  నాయకత్వం చేసిన కొన్ని పొరపాట్లతో బీజేపీ తెలంగాణలో రెండో స్థానం కోసం పోటీపడుతోంది. బీజేపీ జాతీయ నాయకత్వం కూడ తెలంగాణపై కేంద్రీకరించింది.

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుండి బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకొంది. కాంగ్రెస్ మూడు స్థానాలకే పరిమితమైంది. బీజేపీ అనూహ్యంగా కరీంనగర్,ఆదిలాబాద్, నిజామాబాద్ ఎంపీ స్థానాలను  గెలుచుకొంది. సికింద్రాబాద్ స్థానంలో బీజేపీ విజయం సాధిస్తోందని ఊహించారు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అనుసరించిన  విధానాల కారణంగా బీజేపీ ఈ మూడు సీట్లను దక్కించుకొంది.

కరీంనగర్,నిజామాబాద్ ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ క్యాడర్ బీజేపీ సహకరించినట్టుగా ఎన్నికల ఫలితాలకు ముందే టీఆర్ఎస్ కు సమాచారం అందింది. ఈ కారణంగానే బీజేపీ విజయం సాధించినట్టుగా టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు.

ఎంపీ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాల్లో గెలుపొందడం ఆ పార్టీ శ్రేణుల్లో మంచి ఉత్సాహన్ని నింపింది. బీజేపీ జాతీయ నాయకత్వం కూడ తెలంగాణపై కేంద్రీకరించింది.వచ్చే ఎన్నికల నాటికి అధికారంలోకి వచ్చేలా పావులు కదుపుతోంది.

తెలంగాణలో ఉన్న టీడీపీకి చెందిన క్యాడర్‌పై బీజేపీ కేంద్రీకరించింది. తెలంగాణలోని సుమారు  60 మంది కీలక నేతలు బీజేపీలో ఆదివారం నాడు చేరారు.ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడ బీజేపీ తీర్ధం పుచ్చుకొన్నారు. రానున్న రోజుల్లో మరికొందరు నేతలు కూడ బీజేపీలో చేరే అవకాశం ఉంది.

బీజేపీ స్పీడ్ తో కాంగ్రెస్ నేతలు ఖంగుతిన్నారు. బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలు గెలవడం రాజకీయంగా తమకు నష్టం చేసిందని కాంగ్రెస్ నాయకత్వం ఆలస్యంగా గుర్తించింది. నష్ట నివారణ చర్యలకు దిగింది. అయితే కాంగ్రెస్ కు చెందిన నేతలపై కూడ బీజేపీ కన్నేసింది.

తెలంగాణలో క్షేత్రస్థాయి నుండి బలపడేందుకు బీజేపీ నాయకత్వం ప్రయత్నాలను ప్రారంభిస్తోంది.ఈ పరిణామంతో కాంగ్రెస్ నాయకత్వం  మేల్కొంది.బీజేపీ బలపడితే రాజకీయంగా  తమకు ఇబ్బందులు తప్పవని కాంగ్రెస్ భావిస్తోంది.

నష్ట నివారణ చర్యలకు కాంగ్రెస్ పూనుకొంది. బీజేపీ నేతలు చర్చలు జరిపిన కాంగ్రెస్ నేతల ఇళ్లకు వెళ్లి పార్టీలోనే కొనసాగాలని కాంగ్రెస్ నాయకత్వం చర్చించింది.మరో వైపు త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ మేరకు పార్టీ యంత్రాంగాన్ని సన్నద్దం చేస్తోంది. 

ఇటీవలనే సంగారెడ్డిలో ఈ మేరకు కాంగ్రెస్ నాయకత్వం సమావేశమై మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహన్ని ఖరారు చేశారు.ఎంపీ ఎన్నికల తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి చెప్పుకోదగిన సీట్లు రాలేదని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ఈ పరిణామం కొంత కాంగ్రెస్ కు కలిసొచ్చింది.అయితే ఇటీవల కాలంలో ఇతర పార్టీల నుండి పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతున్నారు.

టీఆర్ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్యాయం కాదని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను తామే ఢీకొడతామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేల్లో ఇప్పటికే టీఆర్ఎస్ లో చేరారు. మిగిలిన వారిని కాపాడుకోవాల్సిన పరిస్థితులు ఆ పార్టీకి నెలకొన్నాయి. 

టీఆర్ఎస్ ను ఏ పార్టీ ఢీకొడుతుందనే నమ్మకం ప్రజలకు కలిగిస్తే ఆ పార్టీ వెనుకే టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులు పోగయ్యే అవకాశం ఉందని రాజకీయ  విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

నేతల వరుస క్యూ: తెలంగాణలో టీడీపీ శకం ముగిసినట్టేనా?