ఇదేందయ్యా ఇదీ... ఇలాంటిచోట సర్కార్ నౌకరీ అంటే హెల్మెట్లు పెట్టుకోవాల్సిందేనా..! (వీడియో)
అసలే వర్షాకాలం... అందులోనూ శిథిలావస్థలో వున్న భవనంలోనే రోజంతా వుండాలి... ఇలాంటి పరిస్థితుల్లో బీర్పూర్ ఎంపిడివో ఆఫీస్ సిబ్బంది హెల్మెట్ ధరించి విధులకు హాజరయ్యారు.
జగిత్యాల : ప్రభుత్వ కార్యాలయాలంటే ముందుగా శిథిలావస్థలో వున్న భవనాలు, పాత పర్నీచర్ గుర్తుకువస్తాయి.ఇక కొన్నిచోట్ల అయితే మరింత దారుణంగా కూలిపోడానికి సిద్దంగా వున్న భవనాల్లో కార్యాలయాలు కొనసాగుతుంటాయి. అలాంటి ప్రభుత్వ కార్యాలయాల్లో ఒకటే తెలంగాణలోని జగిత్యాల జిల్లా బీర్పూరు ఎంపిడివో కార్యాలయం. ఈ కార్యాలయ ఉద్యోగులు ప్రాణభయంతో హెల్మెట్లు ధరించి పనులు చేస్తున్నారంటేనే పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థమవుతుంది.
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలోని ఓ పురాతన భవనంలో ఎంపిడివో కార్యాలయం కొనసాగుతోంది. ఎప్పుడు కూలుతుందో కూడా తెలియని ఆ భవనంలో పనిచేయడానికి ఉద్యోగులు భయపడిపోతున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పనిచేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేసారు. వివిధ పనుల కోసం ఎంపిడివో కార్యాలయానికి వెళ్లే ప్రజలు కూడా భవనం పరిస్థితి చూసి భయపడుతున్నారు.
వీడియో
ఇటీవల ఎంపిడివో కార్యాలయంలో అధికారులు పనుల్లో నిమగ్నమై వుండగానే ఒక్కసారగా భవనంలోని కొంతబాగం కుప్పకూలింది. అలాగే ఇప్పటికే శిథిలావస్థకు చేరిన భవనం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బాగా నానింది. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయపడిపోతున్న అధికారులు తమ పరిస్థితిని ప్రభుత్వానికి తెలియజేసేందుకు వినూత్న నిరసన చేపట్టారు.
బీర్పూర్ ఎంపిడివో కార్యాలయ అధికారులంతా హెల్మెట్లు ధరించి విధులకు హాజరయ్యారు. ఏ క్షణంలో ఏ గోడ కూలుతుందో, పైకప్పు పెచ్చులు ఎక్కడ ఊడిపడతాయోనని నిత్యం భయపడుతూనే విధులు నిర్వర్తిస్తున్నామని... అందువల్లే రక్షణగా హెల్మెట్లు ధరించి పనిచేస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. వివిధ పనుల కోసం ఎంపిడివో కార్యాలయానికి వెళ్లినవారు సిబ్బంది హెల్మెట్లు ధరించి పనులుచేయడం చూసి ఆశ్చర్యపోయారు.
ఇప్పటికే ఎంపిడివో కార్యాలయాన్ని ఇలా శిథిలావస్థలో వున్న భవనం నుండి మార్చాలని కోరినా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని సిబ్బంది వాపోయారు. చివరకు గబ్బిలాల మధ్యే వుంటూ పనిచేయాల్సిన దారుణ పరిస్థితి వుందని అంటున్నారు. అందువల్లే హెల్మెట్లతో విధులకు హాజరైతే అయినా తమ పరిస్థితి ఎలా వుందో అర్థమవుతుందని ఇలా చేసామన్నారు. ఇప్పటికైనా బీర్పూర్ ఎంపిడివో కార్యాలయాన్ని సురక్షితమైన భవనంలోని మార్చాలని సిబ్బంది కోరారు.