హైదరాబాద్: కమెడియన్ అలీ నటించిన ఇడియట్ సినిమాలో మాదిరిగానే ఓ దొంగ బైక్ లను ఎత్తుకెళ్లాడు. ఆ సినిమా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో మార్గమధ్యలో బైక్ పై వెళ్తున్న అలీని పోలీసులు ఆపుతారు. పోలీసులు బైక్ మీద ఉన్న ఇసుక బస్తాలను మాత్రమే చూస్తారు. కానీ బైక్ వివరాలు అడగరు. దాంతో అలీ చక్కా బైక్ తో వెళ్లిపోతాడు. 

అదే తరహాలో బైక్ లను దొంగిలించి ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించిన ముగ్గురు దొంగలను పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాదులోని ఆసిఫ్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోరీకి గురైన బైక్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేప్టటారు. దాంతో ముగ్గురు దొంగలు కూడా తమకు చిక్కినట్లు హైదరాబాదు పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ మీడియా ప్రతినిధులకు తెలిపారు. 

ముగ్గురు నిందితులు ఎం. వెంకటేష్ (22), వసీం అక్రమ్ అలియాస్ వసీం (27), సిరాజ్ ఖాన్ (28)లను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 12 టూవీలర్స్ ను స్వాధీనం చేసుకున్నారు. సోమవారంనాడు నిందితులను సీపీ మీడియా ముందు ప్రవేశపెట్టారు. 

దహీల్ బాగ్ మహబూబ్ కాలనీకి చెందిన పాత నేరస్తుడు ఎం. వెంకటేష్ ఆసిఫ్ నగర్ లోని పెట్రోలు బంకులో పనిచేస్తున్నాడు. అతనిపై 12కు పైగా బైక్ దొంగతనం కేసులు ఉన్నాయి. కొద్ది రోజుల కింద వసీం అక్రమ్, సిరాజ్ ఖాన్ లతో అతనికి పరిచయం ఏర్పడింది. వారిద్దరితో కలిసి వెంకటేష్ బైక్ చోరీలకు పాల్పడ్డాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వెంకటేష్ జైలు నుంచి విడుదలయ్యాడు. 

రాత్రి సమయాల్లో తన వద్ద ఉన్న తాళాలతో పార్క్ చేసి ఉన్న బైక్ తాళాలను ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. తాళం వస్తే ఆ విషయాన్ని వసీం అక్రమ్, సిరాజ్ ఖాన్ లకు తెలియజేస్తాడు. వారు వచ్చి ఆ బైక్ లను వెరే ప్రాంతాల్లో పార్క్ చేస్తారు. వాటిని హైదరాబాదులో అమ్మకుంాడ వేరే ప్రాంతాల్లో అమ్మేందుకు సిద్ధపడ్డారు. 

బైక్ లను దొంగలించి ఆ బైక్ లపై ఇసుకను తరలించినట్లుగా నటిస్తూ బీదర్ వెళ్లి వాటిని అమ్మాలని పథకం వేశారు. అయితే, పోలీసులు వారిని ఫొటో అండ్ ఎనాస్ మెంట్ ద్వారా పట్టుకున్నారు.