పచ్చని తోరణాలతో, బంధుమిత్రుల హడావుడితో సరదాగా ఉండాల్సిన ఆ ప్రాంగణం విషాదంతో నిండిపోయింది. పెళ్లికోసం తెచ్చిన నగలు, నగదు దొంగల బారిన పడడంతో ఏం చేయాలో పాలుపోక ఆ కుటుంబం తల పట్టుకుంది. 

మహబూబ్ నగర్ జిల్లాలో భారీ చోరీ జ‌రిగింది. మిడ్జిల్ మండలం బోయిన్ పల్లిలో ఓ ఇంట్లో సుమారు 200 తులాల బంగారు న‌గ‌లు, ఎనిమిది లక్షల రూపాయల నగదు అప‌హ‌ర‌ణ‌కు గురైంది. 

బోయిన్ పల్లి గ్రామానికి చెందిన ఇంద్రారెడ్డి కూతురి పెళ్లి పెట్టుకున్నాడు. పెళ్లిలో కూతురికి పెట్టాల్సిన 200 తులాల నగలతో పాటు, పెళ్లి ఖర్చుల కోసమని 8లక్షల నగదు ఇంట్లో తెచ్చిపెట్టారు. ఇంట్లో శుక్రవారం రాత్రి  దొంగలు చొర‌బ‌డ్డారు.

 కూతురి వివాహం కోసం తెచ్చిన నగలతో పాటుగా కుటుంబసభ్యుల ఆభరణాలు దొంగిలించారు. ఇదంతా జరిగిన సమయంలో కుటుంబ సభ్యులు అందరూ ఇంట్లోనే నిద్రిస్తున్నారు.

పొద్దున్నే లేచిచూసేస‌రికి ఇల్లు  గుల్ల అయింది. వెంటనే తేరుకున్న కుటుంబసభ్యులు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు.. విచార‌ణ చేప‌ట్టారు. ఇది తెలిసిన‌వారి ప‌నా? లేక నిజంగానే దొంగ‌లు ప‌డ్డారా? అనే కోణంలో విచార‌ణ చేప‌ట్టారు పోలీసులు.