Basara IIIT: తెలంగాణ‌లోని రెసిడెన్సియ‌ల్ హాస్ట‌ల్స్ లో ఉంటున్న విద్యార్థులు అనేక ఇబ్బందులు ప‌డుతున్నార‌నీ, ఈ విష‌యంలో ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా ఉంటున్న‌ద‌ని మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు  గీతారెడ్డి మండిప‌డ్డారు. బాస‌ర ఐఐఐటీలో వంద‌ల‌మంది విద్యార్థులు ఫుడ్ పాయిజ‌న్ బారిన‌ప‌డ్డ‌ప్ప‌టికీ.. సీఎం కేసీఆర్ సంద‌ర్శించ‌క‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు గుప్పించారు.  

Congress leader Geeta Reddy: తెలంగాణ‌ కాంగ్రెస్ నాయ‌కులు దూకుడు పెంచారు. స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా కేంద్రంలోని భార‌తీయ జ‌నతా పార్టీ (బీజేపీ), రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్‌) ప్ర‌భుత్వాల‌పై విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌తో విరుచుకుప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కురాలు డాక్ట‌ర్ జే.గీతారెడ్డి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. బాసర ఐఐఐటీలో ఫుడ్ పాయిజన్ ఘటనను నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఈ విష‌యంలో నిర్ల‌క్ష్యంగా ఉన్నార‌నీ, మంత్రి హ‌రీశ్ రావు పైనా ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

గాంధీభవన్‌లో ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌తో కలిసి గీతా రెడ్డి మీడియా స‌మావేశంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ... రాష్ట్రంలోని అన్ని రెసిడెన్షియల్ హాస్టళ్లలో విద్యార్థులు కలుషిత ఆహారం, నీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విద్యార్థుల దృష్టిలో తండ్రి స్థానంలో ఉన్న సీఎం కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలోని ఏ ఒక్క హాస్టళ్లకైనా వెళ్లినా పట్టించుకోలేద‌న్నారు. ముఖ్యమంత్రి హాస్టళ్లను సందర్శిస్తే అక్క‌డి స‌మ‌స్య‌లు తీరుతాయ‌నే అభిప్రయ ప‌డ్డారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి త‌న్నీరు హరీశ్‌రావు తన సిద్దిపేట జిల్లాకు చెందిన రెసిడెన్షియల్‌ హాస్టల్‌కు ఇలాంటి ఫుడ్‌ పాయిజన్‌ ​​ఘటన జరిగిన తర్వాత కూడా రాలేదని ఆమె ఆరోపించారు. సిద్దిపేట రెసిడెన్షియల్ హాస్టల్ మెస్ కాంట్రాక్టర్ రాష్ట్ర మంత్రి బంధువని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులు తమ హక్కుల సాధన కోసం చేస్తున్న ఆందోళన కార్యక్రమాలను రాష్ట్ర మంత్రులు సిల్లీ ఇష్యూలుగా పిలుస్తున్నారని ఆమె అన్నారు.

ఫుడ్ పాయిజన్ ఘటనలకు నిధుల కొరత కూడా ఒక కారణమని ఆమె పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తోందని, బాసర ఐఐఐటీలో పెద్ద కుంభకోణం జ‌రుగుతోందని ఆరోపించారు. ఇటీవల రాష్ట్రంలోని వరద ప్రాంతాలను సందర్శించినట్లుగా విద్యార్థుల వసతి గృహాలను కూడా సందర్శించాలని ఆమె సీఎంను డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని రెసిడెన్షియల్ హాస్టళ్లలో గత రెండు నెలల్లో మొత్తం తొమ్మిది ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకున్నాయని బల్మూరి వెంకట్ తెలిపారు. హాస్టళ్లలో మెస్ కాంట్రాక్టర్లు తమకు అందిస్తున్న ఆహారాన్ని గమనించి పలువురు విద్యార్థులు తమ అడ్మిషన్లను రద్దు చేసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ తప్పులను, అక్రమాలను ప్రశ్నించినప్పుడల్లా తమపై భౌతిక దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలోని హాస్టళ్లను సందర్శించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని డిమాండ్ చేశారు. బాసర ఐఐఐటీలో 90 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపించారు.

కాగా, గత కొన్ని రోజులుగా బాసరలోని ఐఐఐటీలో విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆందోళనలు చేస్తున్నారు. అధికారులు పలు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పిన వెనక్కి తగ్గని విద్యార్థులు ముఖ్యమంత్రి కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్ క్యాంపస్ ను సందర్శించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు కొనసాగించారు. మంత్రి సబితా విద్యార్థులతో చర్చలు జరపడంతో దానికి ముంపిపు పడింది. అయితే, మరోసారి విద్యార్థులు పెద్దఎత్తున ఫుడ్ పాయిజన్ కు గురికావడంతో ఆందోళనలకు దిగారు.