అనంతపురం జిల్లా డీ. హీరేహాళ్ మండలం ఓబుళాపురం గనుల సరిహద్దుల వివాదంపై దర్యాప్తు పూర్తయ్యేవరకు సీబీఐ కోర్టులో విచారణను నిలిపివేయాలంటూ ఐఏఎస్ అధకారి శ్రీలక్ష్మి పిటిషన్ దాఖలు చేశారు

ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి భారీ ఊరట లభించింది. ఓఎంసీ కేసులో దర్యాప్తు పూర్తయ్యిందని రాతపూర్వకంగా సీబీఐ కోర్టులో మెమోలు దాఖలు చేయాలని సీబీఐకి తెలంగాణ హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు ఈ కేసులో నిందుతురాలైన ఏపీ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై కఠిన చర్యలు తీసుకోవద్దని సీబీఐ కోర్టును ఆదేశించింది.

తదుపరి విచారణను 16వ తేదీకి వాయిదా వేసింది. అనంతపురం జిల్లా డీ. హీరేహాళ్ మండలం ఓబుళాపురం గనుల సరిహద్దుల వివాదంపై దర్యాప్తు పూర్తయ్యేవరకు సీబీఐ కోర్టులో విచారణను నిలిపివేయాలంటూ ఐఏఎస్ అధకారి శ్రీలక్ష్మి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం జస్టిస్ షమీమ్ అక్తర్ మరోసారి విచారణ చేపట్టి ఈ ఉత్తర్వులిచ్చారు.

జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో ఈడీ నమోదు చేసిన కేసుల్లో విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 16వ తేదీకీ వాయిదా వేసింది. అరబిందో, హెటిరో, పెన్నా, రాంకీ, జగతి పబ్లికేషన్స్, ఇందూ టెకోజోన్, ఇండియా సిమెంట్స్ కేసులు విచారణకు వచ్చాయి. సీబీఐ కేసు తర్వాత వీటి విచారణ చేపట్టాలంటూ నిందితులు దాఖలు చేసిన పిటిషన్లు హైకోర్టులో పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో విచారణ వాయిదా పడింది.