తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించకముందు తమిళిసై సౌందరరాజన్‌ బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షురాలిగా పనిచేశారు. బీజేపీ చీఫ్‌ హోదాలో ఆమె 2017లో పత్రికలకు, టీవీ చానళ్ళకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ కి హైకోర్టులో ఊరట లభించింది. తమిళనాడులోని కాంచీపురం దిగువ కోర్టులో పెండింగ్‌లో ఉన్న పరువునష్టం కేసును మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. న్యాయమూర్తి జస్టిస్‌ ఎం దండపాణి మంగళవారం ఈ మేరకు తీర్పు ఇచ్చారు. వివరాల్లోకి వెళితే....తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించకముందు తమిళిసై సౌందరరాజన్‌ బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షురాలిగా పనిచేశారు. బీజేపీ చీఫ్‌ హోదాలో ఆమె 2017లో పత్రికలకు, టీవీ చానళ్ళకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

తమిళనాడులోని విదుతలై చిరుతైగళ్‌ కచ్చి(వీసీకే)పార్టీపైనా, దాని అధ్యక్షుడు తిరుమవలవన్‌ను కించపరిచే విధంగా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వీసీకే పార్టీ ప్రజల భూములను ఆక్రమించుకుంటోందని కూడా ఆమె ఆరోపించారు. దీంతో ఆ పార్టీకి చెందిన నాయకుడు కార్తికేయన్‌ కాంచీపురంలోని జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో తమిళిసైపై ప్రైవేటు కేసు పెట్టారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు సౌందరరాజన్‌కు సమన్లు జారీ చేసింది. తనపై కేసును కొట్టేయాలని కోరుతూ ఆమె మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ట్రయల్‌ కోర్టు వివేచనతో వ్యవహరించలేదని పేర్కొంటూ జస్టిస్‌ దండపాణి కింది కోర్టులోని కేసును కొట్టివేశారు.