హైదరాబాద్: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కరోనా సోకింది. ఆయన హోం క్వారంటైన్ లో ఉన్నారు.దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో దౌల్తాబాద్ మండలానికి వెంకట్ రెడ్డి ఇంచార్జీగా కొనసాగుతున్నారు.

ఈ మండలంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాల్లో ఆయన విస్తృతంగా పాల్గొంటున్నారు.  అనారోగ్యంగా ఉండడంతో ఆయన పరీక్షలు చేయించుకొన్నాడు. దీంతో కరోనా సోకిందని ఈ పరీక్షల్లో తేలింది. దీంతో ఆయన హోం క్వారంటైన్ కు పరిమితమయ్యారు.

మరో వైపు ఇటీవల కాలంలో కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. అంతేకాదు వారంతా హోం క్వారంటైన్ లో ఉండాలని ఆయన సూచించారు.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు 2,27,580కి చేరుకొన్నాయి. ఇవాళ 1456 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. రాష్ట్రంలో 20,199 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది. అయితే  రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలపై హైకోర్టు ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై వైద్య ఆరోగ్య శాఖాధికారుల తీరుపై  మండిపడిన విషయం తెలిసిందే.