Asianet News TeluguAsianet News Telugu

నన్నుహోంగార్డుతో పోల్చారు, పార్టీ నుండి పంపే ప్రయత్నం: రేవంత్ పై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్

చండూరు సభలో తనను దూషిస్తూ చేసిన వ్యాఖ్యలు ఎంతో బాధ కల్గించాయని  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.  ఈ రకమైన వ్యాఖ్యలతో పార్టీ నుండి తనను పంపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

Bhuvanagiri MP Komatireddy Venkat Reddy Serious Comments on TPCC Chief Revanth Reddy
Author
Hyderabad, First Published Aug 12, 2022, 2:06 PM IST

హైదరాబాద్: తనను అసభ్యంగా దూషించి పార్టీ నుండి వెళ్లేలా కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  ఆరోపించారు.శుక్రవారం నాడు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎన్టీవీ న్యూస్ చానెల్ తో మాట్లాడారు. 

తనను హోంగార్డుతో పోల్చడం అత్యంత బాధ కల్గించిందన్నారు. తనను పార్టీ నుండి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని వెంకట్ రెడ్డి ఆరోపించారు. తనను పార్టీ నుండి పంపించి కాంగ్రెస్ ను ఖాళీ చేయాలనుకుంటున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  అభిప్రాయపడ్డారు. 

also read:Munugode bypoll 2022: పాల్వాయి స్రవంతితో కాంగ్రెస్ అగ్రనేతల చర్చలు

 మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన సమావేశానికి సంబంధించిన తనకు సమాచారం లేదన్నారు. తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జరిగే సభకు సంబంధించిన సమాచారం ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పు బట్టారు. చండూరులో నిర్వహించిన సభలో తనను అద్దంకి దయాకర్ దూషిస్తే అదే వేదికపై ఉన్న కాంగ్రెస్ అగ్రనేతలు నవ్వారన్నారు. కానీ పరుష పదజాలం ఉపయోగించిన అద్దంకి దయాకర్ తీరును వేదికపై ఉన్న నేతలు ఎందుకు తప్పు పట్టలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.

 ఈ సభ జరిగిన మరునాడు అద్దంకి దయాకర్ కు షోకాజ్ అంటూ నాటకం ఆడారన్నారు. పార్టీ కోసం 30ఏళ్లుగా పనిచేస్తున్న తనను దూషించడంపై తెలుగు ప్రజలంతా తప్పుబడుతున్నారన్నారు.

భేషరతుగా దయాకర్ క్షమాపణ చెప్పాలన్నారు ఈ విషయమై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలన్నారు.  కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో రేవంత్ రెడ్డి ఫ్రాంచైజీగా మార్చారని దాసోజు శ్రవణ్ చేసిన వ్యాఖ్యలను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమర్ధించారు. 

ప్రజల్లో ఉన్న నేతలకే టికెట్లు ఇవ్వాలని తాను రాహుల్ గాంధీ ముందే చెప్పానన్నారు. అంతేకాదు ఆరు మాసాల ముందే అభ్యర్ధులను ఖరారు చేయాలని తాను ప్రకటించిన విషయాన్ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుర్తు చేశారు.  రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైతే ఏమౌతుందని రేవంత్ రెడ్డి చేసన వ్యాఖ్యలను కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తప్పుబట్టారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చెప్పకుండా ఇలా చెబితే కాంగ్రెస్ క్యాడర్ మనోస్థైర్యం కోల్పోయే అవకాశం ఉండదా అని ఆయన ప్రశ్నించారు. యుద్ధం చేయకముందే చేతలు ఎత్తివేస్తే ఎలా అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.

నాలుగు పార్టీలు మారి వచ్చిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఓడితే  నష్టం ఏముంటుందన్నారు. తన లాంటి వాళ్లది కాంగ్రెస్ రక్తమన్నారు. తన లాంటి వాళ్లను తిట్టించి పార్టీకి దూరం చేస్తే  డమ్మీలతో పార్టీని నడుపుకోవాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ విషయమై తాను రాహుల్ గాంధీ వద్దే తేల్చుకొంటానని కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తేల్చి చెప్పారు.దళిత బంధును మునుగోడు నియోజకవర్గం మొత్తం  ఇవ్వాలన్నారు. బీసీలకు కూడ ప్రతి ఇంటికి రూ. 10 లక్షలు ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. 

మాణికం ఠాగూర్ మునుగోడు అసెంబ్లీ విషయమై నిర్వహించిన సమావేశానికి తనకు సమాచారం లేదన్నారు జానారెడ్డి నివాసానికి ఠాగూర్ వెళ్లారన్నారు.  పెద్ద పెద్ద నేతలు ఈ ఎన్నిక విషయమై చూసుకుంటారన్నారు. తాము హోంగార్డులమని, బ్రాందీ షాపులు నడుపుకొనే వాళ్లమని వెంకట్ రెడ్డి చెప్పారు. 

ఒకవైపు తమ్ముడు, మరో వైపు పార్టీ ఈ పరిస్థితిలో ఏం చేయాలని తాను తీవ్రంగా మధనపడుతుంటే  ఈ రకంగా మాట్లాడి తనను పార్టీ నుండి బయటకు పంపాలని ప్రయత్నిస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు.

బ్రాందీ షాప్ నడుపుకొనే వాళ్లం, హోంగార్డు అంటూ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారుఈ వ్యాఖ్యలపై రాష్ట్రంలో పార్టీని లీడ్ చేసే నేతలు క్షమాపణలు చెప్పి ప్రచారానికి ఆహ్వానిస్తే తాను మునుగోడులో ప్రచారానికి వెళ్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తేల్చి చెప్పారు,.  తాను  కాంగ్రెస్ పార్టీలోనే  ఉంటానని పునరుద్ఘాటించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios