కాంగ్రెస్‌లో చేరాలని ఆహ్వానించా: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో ముగిసిన జూపల్లి భేటీ
కాంగ్రెస్ పార్టీని వీడిన నేతలు తిరిగి కాంగ్రెస్ లో చేరాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును ఆహ్వానించినట్టుగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో చేరాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును ఆహ్వానించామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ఆదివారంనాడు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో హైద్రాబాద్ లో భేటీ అయ్యారు.ఈ భేటీ ముగిసిన తర్వాత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీని వీడిన వారంతా తిరిగి పార్టీలో చేరాలని ఆహ్వానించామన్నారు. జూపల్లి కృష్ణారావు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదన్నారు. చాలా మంది నేతలతో రోజూ మాట్లాడుతున్నానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరే విషయం తనకు తెలియదన్నారు. భేషరతుగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరితే నష్టం లేదని ఆయ న అభిప్రాయపడ్డారు. నల్గొండలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ టూర్ పై రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.
జూపల్లి కృష్ణారావుతో తనకు 1999 నుండి మంచి అనుబంధం ఉందన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. పార్టీలు మారినా కూడ తాము అప్పుడప్పుడూ కలుసుకుంటూనే ఉంటామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
also read:కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో జూపల్లి కృష్ణారావు భేటీ: కాంగ్రెస్ లో చేరికపై చర్చలు
తెలంగాణ ఉద్యమం సమయంలో ఆనాడు తామిద్దరం మంత్రి పదవులకు రాజీనామా చేశామన్నారు. తేనేటీ విందుకు జూపల్లి కృష్ణారావును తాను ఆహ్వానించినట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. తాను కరుడుకట్టిన కాంగ్రెస్ వాదిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పుకున్నారు. పార్టీని వీడిన వారిని తిరిగి పార్టీలో చేరాలని ఆహ్వానిస్తున్నామన్నారు. పాత మిత్రుడిని కలిసేందుకు వచ్చా: జూపల్లి కృష్ణారావు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన పాత మిత్రుడని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. తనను టీ తాగేందుకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆహ్వానించారన్నారు. క్యాజువల్ గానే ఈ సమావేశానికి వచ్చినట్టుగా చెప్పారు. ఏ పార్టీలో చేరేది ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.