కాంగ్రెస్‌కు రాజీనామా: కోమటిరెడ్డి ఏం చెప్పారంటే
కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టుగా సాగుతున్న ప్రచారంపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టత ఇచ్చారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ కు రాజీనామా చేస్తానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తాను నిన్నంతా సోనియాగాంధీతోనే ఉన్నట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. తాను కాంగ్రెస్ ను వీడుతున్నానని సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఈ ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన పార్టీ కార్యకర్తలను కోరారు. తనది కాంగ్రెస్ రక్తమేనని ఆయన చెప్పారు. తన ముందు ఎలాంటి ఆఫ్షన్స్ లేవన్నారు.
పార్టీ మారాలనుకుంటే కార్యకర్తలను సంప్రదించి నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు.మళ్లీ పార్టీ ఆదేశిస్తే ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. పార్టీలో పదవి వస్తుందని ఆశిస్తున్నట్టుగా ఆయన పేర్కొన్నారు. పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు.
గత ఏడాది చివర్లో మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ పార్టీకి , మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి స్వంత సోదరుడు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిన సమయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా బీజేపీలో చేరుతారని ప్రచారం సాగింది. అయితే తాను కాంగ్రెస్ పార్టీని వీడనని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. తాను చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా బరిలో ఉండడంతో వెంకట్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఈ ఎన్నికలు జరుగుతున్న సమయంలో అస్ట్రేలియా టూర్ కు వెళ్లారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈ టూర్ లో మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి విజయం సాధించే అవకాశం లేదని వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించినట్టుగా సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఫోన్ చేసి బీజేపీ అభ్యర్ధి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని వెంకట్ రెడ్డి కోరారు. ఈ ఆడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి షోకాజ్ నోటీసు ఇచ్చింది.
also read:రేవంత్ రెడ్డి పిలువలేదు: భట్టితో భేటీ తర్వాత కోమటిరెడ్డి
ఆ తర్వాత ఈ షోకాజ్ నోటీసులను పార్టీ చెత్తబుట్టలో వేసిందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేుస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీతో వెంకట్ రెడ్డి సమావేశమై రాష్ట్రంలో పార్టీని బలోపేతంపై చర్చించారు. అయితే తాజాగా వెంకట్ రెడ్డి పార్టీ మారుతున్నారనే ప్రచారంపై ఆయన స్పష్టత ఇచ్చారు.