ఢిల్లీకి చేరుకున్న కోమటిరెడ్డి:ఉత్తమ్ నివాసంలో లంచ్ భేటీ
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం నడు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసంలో లంచ్ భేటీకి హాజరయ్యారు. ప్రియాంక గాంధీతో సమావేశానికి హైద్రాబాద్ నుండి ఢిల్లీకి చేరుకున్నారు.
హైదరాబాద్: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం నాడు మధ్యాహ్నం నల్గొండ ఎంపీ మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసంలో లంచ్ భేటీ కి హాజరయ్యారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ ఆహ్వానం మేరకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ ఉదయం హైద్రాబాద్ నుండి న్యూఢిల్లీకి వచ్చారు. ఈ నెల 22న న్యూఢిల్లీలో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సమావేశానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దూరంగా ఉన్నారు. తనను అవమానిస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి ఈ సమావేశంలో పాల్గొనడం తనకు ఇష్టం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. ఈ విషయమై పార్టీ చీఫ్ సోనియాగాంధీకి అదే రోజున లేఖను పంపారు.ఈ సమావేశానికి హాజరు కాకుండా ఢిల్లీ నుండి హైద్రాబాద్ కు చేరుకున్నారు. హైద్రాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు మాణికం ఠాగూర్ పై విమర్శలు గుప్పించారు. మాణికం ఠాగూర్ తో పాటు రేవంత్ రెడ్డిలను ఆ బాధ్యతల నుండి తప్పించాలని కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పార్టీని నాశనం చేస్తున్నారని ఆయన వీరిద్దరిపై ఆరోపణలు చేశారు.
రెండు రోజుల క్రితం జరిగిన సమావేశంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంశంపై కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో చర్చించాలని పార్టీకి చెందిన ముఖ్య నేతలకు ప్రియాంక గాంధీ సూచించారు. మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి నిలిపే అభ్యర్ధి విషయమై కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కూడా చర్చించాలని ప్రియాంక గాంధీ కోరారు. ప్రియాంకగాంధీ సూచనలను పాటిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. త్వరలోనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పార్టీ ముఖ్యనేతలు సమావేశం కానున్నట్టుగా రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ఈ తరుణంలోనే ప్రియాంక గాంధీ ఆహ్వానం మేరకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ న్యూఢిల్లీకి వచ్చారు. న్యూఢిల్లీకి చేరుకున్న వెంటనే ఆయన నేరుగా నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసంలో లంచ్ భేటీకి హాజరయ్యారు. ఇవాళ సాయంత్రం ప్రియాంక గాంధీతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరుకానున్నారు. రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలు పార్టీ నేతలు ముఖ్యంగా రేవంత్ రెడ్డి తన పట్ల వ్యవహరిస్తున్న తీరును కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రియాంక గాంధీకి వివరించే అవకాశం ఉంది.
ఈ నెల 5వ తేదీన చండూరులో నిర్వహించిన కాంగ్రెస్ సభలో అద్దంకి దయాకర్ తనపై చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం గా ఉన్నారు. గత ఎన్నికల్లో తనను ఓడించేందుకు ప్రయత్నించిన చెరుకు సుధాకర్ ను పార్టీలో చేర్చుకొనే విషయంలో కూడా తనతో చర్చించలేదని కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెబుతున్నారు. ఇటీవల కాలంలో తనను ఉద్దేశించి రేవంత్ రెడ్డితో పాటు ఆయన వర్గీయులు చేసిన వ్యాఖ్యలను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రియాంక గాంధీ దృష్టికి తీసుకు వచ్చే అవకాశం ఉంది.