టీఆర్ఎస్ కార్యక్రమాలపై సమాచారం ఇవ్వడం లేదు: మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అసంతృప్తి
పార్టీ కార్యక్రమాల గురించి తమకు సమాచారం ఇవ్వకపోవడంపై మంత్రి జగదీష్ రెడ్డి సమాధానం చెప్పాలని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ చెప్పారు. మునుగోడులో పోటీకి ఆసక్తి చూపడం తప్పా అని ఆయన ప్రశ్నించారు.
భువనగిరి: పార్టీ కార్యక్రమాల గురించి తనతో పాటు ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని భువనగిరి ఎంపీ, టీఆర్ఎస్ నేత బూర నర్సయ్య గౌడ్ చెప్పారు.
ఆదివారం నాడు ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లాలో మీడియాతో మాట్లాడారు. భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో జరిగే పార్టీ కార్యక్రమాల గురించి తనకు సమాచారం ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పు బట్టారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పార్టీ కార్యక్రమాలను మంత్రి జగదీష్ రెడ్డి భుజాన వేసుకుని నడుపుతున్నారని అనిపిస్తుందన్నారు. పార్టీ కార్యక్రమాలకు సంబందించి సమాచారం ఇచ్చినా ఇవ్వకున్నా పార్టీ కోసం పనిచేస్తామన్నారు. మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయాలని భావించడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఏ బాధ్యత అప్పగించినా స్వీకరిస్తానని ఆయన చెప్పారు.
2014లో భువవగిరి ఎంపీ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా బూర నర్సయ్య గౌడ్ పోటీ చేసి విజయం సాధించాడు. 2019 ఎన్నికల్లో మళ్లీ ఇదే స్థానంనుండి బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతితో ఓటమి పాలయ్యాడు.
మునుగోడు అసెంబ్లీ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నికలు జరగనున్నాయి.గత నెల 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. దీంతో ఆరు మాసాల్లోపుగా ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరగాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.
మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే టీఆర్ఎస్ టికెట్ ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. అయితే ఈ స్థానం నుండి బూర నర్సయ్య గౌడ్ కూడా పోటీ చేయడానికి ఆసక్తిని చూపుతున్నారు.ఈ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. బీసీ సామాజిక వర్గం ఓటర్లను తమ వైపునకు తిప్పుకోవాలంటే బూర నర్సయ్యగౌడ్ కు టికెట్ ఇవ్వాలనే ఆయన వర్గీయులు కోరుతున్నారు.
అయితే గత ఎన్నికల్లో ఓటమి పాలైన కూసుకుంట్ర ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వవద్దని నియోజకవర్గంలోని టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు. గతంలోనే నియోజకవర్గానికి పలువురు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు సమావేశమై కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వవద్దని కోరారు. ఒకవేళ టికెట్ ఇస్తే తాము పని చేయబోమని కూడా చెప్పారు. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లిన తర్వాత కూడా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వ్యతిరేక వర్గం సమావేశమై ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ తరరుణంలో బూర నర్సయ్య గౌడ్ ఇవాళ చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారి తీస్తున్నాయి.