ప్రేమను నిరాకరించిన బాలిక హత్య: శ్రీకాంత్ కు జీవిత ఖైదు విధించిన భువనగిరి కోర్టు
ప్రేమను నిరాకరించిందనే నెపంతో బాలికను అత్యంత కిరాతకంగా హత్య చేసిన నిందితుడు శ్రీకాంత్ కు భువనగిరి కోర్టు జీవిత ఖైదును విధిస్తూ సోమవారం నాడు తీర్పు చెప్పింది.
భువనగిరి: ప్రేమను నిరాకరించిందనే నెపంతో బాలికను చంపిన కేసులో నిందితుడు జీవిత ఖైదు విధిస్తూ భువనగిరి కోర్టు సోమవారం నాడు సంచలన తీర్పు వెల్లడించింది.యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని యాదగిరిపల్లికి చెందిన మృతురాలిని అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ ప్రేమ పేరుతో వేధించేవాడు. శ్రీకాంత్ ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడు. తనను ప్రేమించడంతో పాటు పెళ్లి చేసుకోవాలని కూడా శ్రీకాంత్ మృుతురాలిపై పలుమార్లు బెదిరింపులకు దిగాడు. అయితే ఇందుకు ఆమె నిరాకరించింది. ఈ విషయం తెలిసిన తర్వాత ఆ బాలికకు వివాహం చేయాలని పేరేంట్స్ నిర్ణయించుకున్నారు.ఈ విషయమై గ్రామ పెద్దలు కూడా శ్రీకాంత్ కు హెచ్చరించారు. బాలిక పెళ్లి విషయంలో జోక్యం చేసుకోవద్దని కూడ సూచించారు.
కానీ శ్రీకాంత్ వినలేదు. 2017 జూన్ 10వ తేదీన బాలిక ఒక్కతే ఇంట్లో ఉన్న విషయాన్ని గమనించి ఇంట్లోకి ప్రవేశించి తన వెంట తెచ్చుకున్న కత్తితో శ్రీకాంత్ బాలికను కత్తితో పొడిచాడు. బాలిక కేకలు విన్న వెంటనే అప్పుడే ఇంట్లోకి వచ్చిన సోదరుడు శ్రీకాంత్ ను అడ్డుకోబోయాడు. అయితే శ్రీకాంత్ బాలిక సోదరుడిపై కూడా కత్తితో దాడికి దిగాడు. ఇద్దరిపై కత్తితో దాడి చేసి పారిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే బాలికను భువనగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే బాలికను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయిందని తేల్చి చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు శ్రీకాంత్ ను అరెస్ట్ చేశారు. అంతేకాదు నిందితుడు ఈ నేరం చేసిన విషయమై పోలీసులు ఆధారాలను కోర్టుకు సమర్పించారు. దీంతో శ్రీకాంత్ ను దోషిగా నిర్ధారించింది. శ్రీకాంత్ కు జీవిత ఖైధు విధించింది.