హైదరాబాద్: ప్రవీణ్ రావు, ఆయన సోదరుల కిడ్నాప్ కేసులో మరిన్ని విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ పాత్ర మరింత స్పష్టంగా ముందుకు వచ్చింది. కిడ్నాప్ వ్యవహారాన్ని పర్యవేక్షించడానికి ఆమె గుంటూరు నుంచి హైదరాబాదు వచ్చిన వైనం వెలుగులోకి వచ్చింది.

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి కాన్వాయ్ వెనకే అఖిలప్రియ గుంటూరు నుంచి హైదరాబాదు చేరుకున్నట్లు తెలుస్తోంది. జనవరి 5 లేదా 6వ తేదీన కిడ్నాప్ చేయాలని భార్గవ్ రామ్, గుంటూరు శ్రీనులకు అఖిలప్రియ సూచించినట్లు చెబుతున్నారు. జనవరి 4వ తేదీన ఆమె తన భర్త భార్గవ్ రామ్ నిర్వహిస్తున్న ఎంజిఎం స్కూల్ చేరుకున్నారు. స్కూల్లో రోజంతా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అఖిలప్రియ, బార్గవ్ రామ్, గుంటూరు శ్రీనులతో పాటు గుంటూరు, విజయవాడల నుంచి వచ్ిచన ఇతర నిందితులు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎప్పుడు ఎలా కిడ్నాప్ చేయాలనే విషయంపై పక్కా ప్రణాళిక వేసుకున్నారు.

జనవరి 5వ తేదీననే కిడ్నాప్ చేయాలని ఆ సమావేశంలో అఖిలప్రియ చెప్పారు. జనవరి 5వ తేదీ ఉదయం ఆమె అమరావతికి వెళ్లారు. టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గుంటూరు శ్రీను ఆమెకు ఫోన్ చేశాడు. కిడ్నాప్ నకు అంతా రెడీగా ఉన్నట్లు చెప్పడంతో ఆమె సాయంత్రం 5.45 గంటలకు హైదరాబాదు బయలుదేరారు. 

అదే సమయంలో టీడీపీ జాతీయ  అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హైదరాబాదులోని తన నివాసానికి బయలుదేరారు. ఆయన కోసం ట్రాఫిక్ క్లియర్ చేయడంతో చంద్రబాబు కాన్వాయ్ వెనకే అఖిలప్రియ తన కారును పోనివ్వాలని డ్రైవర్ చెప్పి వేగంగా విజయవాడ దాటేశారు. 

ఇదిలావుంటే, కిడ్పాప్ వ్యవహారంలో పాత్ర ఉందని అనుమానిస్తు్నన భార్గవ్ రామ్ తల్లి కిరణ్మయి, సోదరుడు చంద్రహాస్ పరారీలో ఉన్నారు. కిడ్నాప్ కేసులో నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారిలో ఐటి అధికారులుగా నటించిన సిద్ధార్థ్, కృష్ణవంశీ, కృష్ణచైతన్య, దేవీప్రసాద్ ఉన్నట్లు తెలుస్తోంది. 

విజయవాడలో ఉంటున్న సిద్ధార్థ్ నిరుడు డిసెంబర్ లో రెండు సార్లు హైదరాబాదు వచ్చి భార్గవ్ రామ్ తో కిడ్నాప్ విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటి వరకు 15 మందిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.