తెలంగాణ కాంగ్రెస్‌లో నేతలు వరుసగా పాదయాత్రలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే అచ్చెంపేట నుంచి హైదరాబాద్ వరకు ఎంపీ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. ఇక సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆదిలాబాద్ నుంచి రైతులతో ముఖాముఖీ ప్రారంభించారు.

ఈ తరుణంలో నార్కెట్‌పల్లి నుంచి ఎస్‌ఎల్‌బీసీ వరకు పాదయాత్ర చేసేందుకు మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సిద్ధమయ్యారు. ఈ నెల 19 నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభం కానుంది.

మరోవైపు ఈ నెలల 22 నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సదాశివపేట నుంచి గన్‌పార్క్ వరకు పాదయాత్ర చేయనున్నారు. వారం రోజుల పాటు జగ్గారెడ్డి పాదయాత్ర చేయబోతున్నారు.

ఇక తెలంగాణలో మూడవ స్థానానికి కాంగ్రెస్ పార్టీ పడిపోవడం కూడా కొంత వరకు నేతల్లో ఆత్మపరిశీలనకు ఇదొక సమయంగా భావిస్తున్నారు. పాదయాత్రల ద్వారా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే నేతల లక్ష్యంగా కనిపిస్తోంది.

నార్కెట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల నుంచి ఇరిగేషన్ కార్యాలయం వరకు కోమటిరెడ్డి పాదయాత్ర జరగనుంది. ప్రాజెక్ట్‌ల సాధన యాత్ర పేరుతో కోమటిరెడ్డి పాదయాత్ర నిర్వహించనున్నారు.

బ్రాహ్మణవెల్లంల, ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కోమటిరెడ్డి పాదయాత్రను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి ప్రారంభించనున్నారు.