టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ఆదివారం జిల్లెలగూడలో జరిగిన కాంగ్రెస్ పార్టీ పరిషత్ అభ్యర్థుల సమావేశంలో ఆయన ప్రసంగించారు.

కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన సబితారెడ్డి.. టీఆర్ఎస్‌లో చేరినప్పటికీ ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఏమీ లేదన్నారు. అంతేకాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఒరిగిందేమీ లేదని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు.

సబిత టీఆర్ఎస్‌లో చేరినా మహేశ్వరంలో ఓటు బ్యాంకు మాత్రం పెరగలేదన్నారు. రాజేంద్రనగర్ పట్టణ ప్రాంతంలో వచ్చిన ఆధిక్యతతోనే చేవెళ్లలో టీఆర్ఎస్ అభ్యర్ధి గెలిచాడని, ఇందులో సబిత గొప్పతనమేమి లేదని ఆయన వ్యాఖ్యానించారు.

సబిత చేరికతో టీఆర్ఎస్ బలం రెట్టింపు కావాల్సి ఉండగా.. కేవలం స్వల్ప తేడా మాత్రమే వచ్చిందని వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. చివరికి ఆమెకు కేసీఆర్ అపాయింట్‌మెంట్ కూడా దొరకని దుస్థితి ఉన్నదన్నారు. నల్గొండ జిల్లాకు చెందిన గుత్తా సుఖేందర్‌రెడ్డిదీ అదే పరిస్ధితని, టీఆర్ఎస్‌లో ఇప్పటి వరకు ఏ పదవీ దక్కలేదని వెంకట్‌రెడ్డి ఆరోపించారు.