People's March: కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక‌ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు ఇవ్వడం బీజేపీ ప్ర‌భుత్వం యొక్క పిరికిపంద చర్య అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమ‌ర్శించారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ఆయ‌న‌ రాజుల దేవుల పాడు లో సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంలో కేంద్ర ప్ర‌భుత్వం పై విరుచుక‌ప‌డ్డారు. 

People's March: కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు ఇవ్వడం బీజేపీ ప్ర‌భుత్వం యొక్క పిరికిపంద చర్య అని తెలంగాణ‌ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమ‌ర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర( People's March) ను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఈ పాద‌యాత్ర‌లో భాగంగా.. శుక్ర‌వారం ఖమ్మం జిల్లా లోని రాజుల దేవుల పాడు లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. బీజేపీ ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌లు గుప్పించారు. సోనియా, రాహుల్ లకు ఈడీ నోటీసులు పంప‌డం.. అధికార బీజేపీ పిరికిపంద చర్య అని విమ‌ర్శించారు. రాజకీయంగా కాంగ్రెస్ ను ఎదుర్కోలేక‌నే బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

స్వాతంత్రోద్య‌మ స‌మ‌యంలో నెహ్రూ కుటుంబం స్థాపించిన నేషనల్ హెరాల్డ్ పత్రిక పై బిజెపి ప్రభుత్వం E.D తో కేసు పెట్టించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని అన్నారు. దేశ సమైక్యత, సమగ్రత కోసం ఇందిరి గాంధీ, రాజీవ్ గాంధీ లు ప్రాణాలు అర్పించారనీ, ఈ దేశం కోసం మోతిలాల్ నెహ్రూ అలహాబాద్, ఢిల్లీలో ఉన్న ఆస్తులను అంకితము చేశారని గుర్తు చేశారు. దేశం కోసం త్యాగం చేసిన గాంధీ కుటుంబం పై అవినీతి బురద జల్లే ప్రయత్నం చేయడానికి బీజేపీ ప్ర‌భుత్వానికి సిగ్గు ఉండాలని విమ‌ర్శించారు. సొంత ఇల్లు కూడా లేనటువంటి సోనియాగాంధీ కి ఈడి నోటీసులు ఇప్పించడం చాలా హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

ఎల్ టి టి, టెర్రరిస్టులకు భయపడని కుటుంబం, నేడు బీజేపీ ఇచ్చే ఈడీ నోటీసులకు భయపడతుందా? అని ప్ర‌శ్నించారు. 13న దేశవ్యాప్తంగా ఈ. డి కార్యాలయాలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముట్టడిస్తామ‌ని హెచ్చ‌రించారు. దేశాన్ని తెగ నమ్ముతున్న ప్రధాని మోడీ బండారాన్ని బయట పెడుతామ‌నీ, ప్రజలను సమీకరించి మోడీ చేస్తున్న కుట్రలను తిప్పి కొడతామ‌నీ అన్నారు. సోనియా, రాహుల్ గాంధీలకు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు అండగా ఉంటార‌ని తెలిపారు. 

బీజేపీ అవినీతి సర్కార్ పై పోరాడుతున్న రాహుల్ గాంధీని కట్టడి చేయడానికి బిజెపి పాలకులు కుట్ర పూరితంగా ఈడీ నోటీసులు పంపి భయపెట్టాలని చూడడం అవివేకమ‌ని అన్నారు. ఇలాంటి 100 నోటీసులిచ్చినా సోనియా గాంధీ కుటుంబం భయప‌డ‌ద‌ని, ఈ విష‌యాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్రహించాలని సూచించారు. అధికార బీజేపీ ఎన్ని కుట్రలు చేసిన చింతన్ శిబిర్ లో తీసుకున్న నిర్ణయాలను ఆపలేదనీ, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ పర్యటిస్తారనీ, ప్రజలను జాగృతం చేసి వచ్చే ఎన్నికల్లో బిజెపి ని గద్దె దింపడం ఖాయమ‌ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దీమా వ్య‌క్తం చేశారు.