తన కొడుకుది ఆత్మహత్య కాదని.. చంపి దానిని ఆత్మహత్యగా చిత్రీకరించారన్నారు మహాబూబ్‌నగర్‌ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో మరణించిన భాస్కర్ తల్లిదండ్రులు.

తన కొడుకుది ఆత్మహత్య కాదని.. చంపి దానిని ఆత్మహత్యగా చిత్రీకరించారన్నారు మహాబూబ్‌నగర్‌ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో మరణించిన భాస్కర్ తల్లిదండ్రులు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మృతుడి తండ్రి సత్యనారాయణ, తల్లి దీవెన, సోదరుడు సుదర్శన్, సోదరి సులోచన మీడియాతో మాట్లాడారు.

హైదరాబాద్ బోరబండ శ్రీరామ్‌నగర్‌కు చెందిన భాస్కర్ ఘట్‌కేసర్‌లోని నల్ల నర్సింహారెడ్డి కాలేజీలో బీఫార్మసీ పూర్తి చేశాడు. ఈ సమయంలో అతనికి మహబూబ్‌నగర్ జిల్లా ఎనుగొండ గ్రామానికి చెందిన నిషిత అనే అమ్మాయితో పరిచయం ఏర్పడి ప్రేమకు దారి తీసింది. అప్పట్లోనే ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఇరు కుటుంబాల ఇళ్లలో తెలపగా.. అమ్మాయి కుటుంబసభ్యులు పెళ్లికి అంగీకరించలేదు.

మరోవైపు ఆగస్టు 19న నిషిత బాబాయ్ వెంకటయ్య భాస్కర్‌కు ఫోన్ చేసి అమ్మాయిని మరిచిపోవాలని బెదిరించాడన్నారు. తర్వాతి రోజు హైదరాబాద్ వచ్చిన వెంకటయ్య తమను బోరబండ కమ్యూనిటీ హాల్‌కు పిలిపించి మరోసారి బెదిరించారని భాస్కర్ తల్లిదండ్రులు తెలిపారు. 21వ తేదీన నిషిత , భాస్కర్‌కు ఫోన్ చేసి మహబూబ్‌నగర్ వచ్చి తన కుటుంబసభ్యులను ఒప్పించాలని కోరడంతో భాస్కర్ అక్కడికి వచ్చాడన్నారు.

మర్నాడు ఉదయం వెంకటయ్య తమకు ఫోన్ చేసి.. భాస్కర్ మహాబూబ్‌నగర్ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య ఉన్నాడని.. అతడిని తీసుకువెళ్లాలని చెప్పడంతో తాము అక్కడికి వెళ్లామన్నారు... అయితే భాస్కర్ ఆగస్టు 23న మళ్లీ మహబూబ్‌నగర్ వెళ్లాడని.. అదే రోజు సాయంత్రం నిషిత బాబాయ్ మరోసారి ఫోన్ చేసి.. భాస్కర్ నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని.. జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఉన్నాడని చెప్పడంతో తాము అక్కడికి వెళ్లేసరికి అతను మృతి చెంది ఉన్నాడన్నారు.

తమ కుమారుడిది ముమ్మాటికీ హత్యేనని భాస్కర్ తల్లిదండ్రులు వాదిస్తున్నారు. తాము మాదిగ కులానికి చెందిన వారమని.. నిషిత కుటుంబం మున్నూరు కాపులని అందుకే భాస్కర్‌ను పిలిపించి హత్య చేసి దానిని ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు.

నిషిత కుటుంబం టీఆర్ఎస్ పార్టీలో ఉందని.. వారికి స్థానిక ఎమ్మెల్యే అండదండలు ఉండటం వల్లే దర్యాప్తు సాగడం లేదన్నారు.. ఆగస్టు 23న భాస్కర్ మరణిస్తే.. సెప్టెంబర్ 3న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని. తమ కుమారుడి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.