హైదరాబాద్: యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు సరికొత్త వ్యూహంతో ముందుకు వెళుతున్నట్లు భారత్ బయోటెక్ ఛైర్మన్, సిఎండీ కృష్ణ ఎల్ల తెలిపారు. ఇప్పటికే కోవాగ్జిన్ పేరిట ఓ టీకాను అభివృద్ది చేశామని... అయితే అంతకంటే సులువుగా కరోనాను తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. టీకా కాకుండా కేవలం ముక్కు ద్వారా కరోనా ఇచ్చే సింగిల్ డోస్ కోవిడ్19 మందును అభివృద్ది చేస్తున్నట్లు... వచ్చే ఏడాది లోపు ఈ మందును
అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.  

ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ సోమవారం నిర్వహించిన ‘దక్కన్‌ డైలాగ్‌’సదస్సులో  కృష్ణ ఎల్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భారత్ బయోటెక్ అభివృద్ది చేస్తున్న కరోనా వ్యాక్సిన్ గురించి మాట్లాడారు. ఇప్పటికే ఐసిఎంఆర్ సాయంతో అభివృద్ది చేసిన కొవాగ్జిన్ మూడో క్లినికల దశలో వుందని తెలిపారు. 

ఇక టీకా కంటే సులువుగా కరోనాను నయం చేసే వ్యాక్సిన్ ను భారత్ బయోటెక్ అభివృద్ది చేస్తోందన్నారు. కోవాగ్జిన్ ఇంజెక్షన్ ద్వారా రెండు సార్లు ఇవ్వాల్సి వుంటుందని... అంటే దేశంలోని 130 కోట్ల జనాభాకు ఇది అందుబాటులో వుండాలంటే 260కోట్ల డోసులు కావాలి. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు దీన్ని అందుబాటులోకి తీసుకురావాలంటే కష్టతరం.  

అందువల్లే ఈజీగా కేవలం ముక్కు ద్వారా అందించే చుక్కల మందును అభివృద్ది చేస్తున్నామన్నారు. ఇప్పటికే 5 చుక్కల రోటావైరస్‌ టీకా, 2 చుక్కల పోలియో వైరస్‌ టీకాను తయారుచేసిన అనుభవవం తమకుంది కాబట్టి కరోనాకు కూడా అలాంటి చుక్కల మందునే తయారు చేస్తున్నామని... వచ్చే ఏడాది ఇది అందుబాటులోకి రానుందని ఎక్కా కృష్ణ అన్నారు.