రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి బన్వర్ లాల్ కు సర్కారు షాక్ అలవెన్సులు ఇవ్వాలని సర్కారుకు బన్వర్ లాల్ లేఖ తమ ఉద్యోగి కానప్పుడు అలవెన్సులు ఇచ్చేది లేదన్న సర్కారు 16లక్షల వరకు రావాల్సి ఉందని లేఖలో కోరిన బన్వర్ లాల్
ఒక ఐఎఎస్ అధికారికి తెలంగాణ సర్కారు షాక్ ఇచ్చింది. ఆయన తనకు రావాల్సిన అలవెన్సుల గురించి లేఖ రాస్తే ఇచ్చేదే లేదంటూ సర్కారు తేల్చి చెప్పింది. ఇంతకూ ఎవరా ఐఎఎస్, ఏమిటా కథ అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవండి.

తెలంగాణ, ఎపిరాష్ట్రాల ఉమ్మడి ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు తెలంగాణ ప్రభుత్వం గట్టి జలక్ ఇచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆయన్ను ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారిగా నియమించింది అలాగే తెలంగాణకు ఇన్‌చార్జిగా నియమించింది. అప్పటి నుంచి ఆయన రెండు రాష్ట్రాలకు పనిచేస్తున్నారు. ఏదైనా విధుల్లో ఉన్న అధికారికి, అదనపు బాధ్యతలు అప్పగిస్తే, వేతనంలో 20శాతాన్ని ఇన్‌చార్జ్ అలవెన్స్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన భన్వర్‌లాల్ వేతనం నెలకు రూ.2.25లక్షలు, తెలంగాణ సీఈఓగా అదనపు బాద్యతలు నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వం నెలకు రూ.45 వేలు చెల్లించాల్సి ఉంటుంది.
రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకూ తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. దాంతో ఇప్పుడు మొత్తం రూ.16లక్షలకు పెరిగింది. తన అలవెన్స్‌లు చెల్లించాలని భన్వర్‌లాల్ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాయగా, ఆయన తమ ఉద్యోగి కాదని, తమ రాష్ట్రానికి చెందని ఉద్యోగికి అలవెన్స్ లు ఇవ్వలేమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
దీంతో తనకు రావాల్సిన అలవెన్సులను ఎలా రాబట్టుకోవాలా అన్న మీమాంసలో పడిపోయారు బన్వర్ లాల్. అడిగిన వారికి, అడగని వారికి కూడా వరాలిచ్చే తెలంగాణ సిఎం కెసిఆర్ ఎన్నికల ధికారి బన్వర్ లాల్ కు ఇచ్చే 16లక్షల విషయంలో ఎందుకంత కఠినంగా వ్యవహరిస్తున్నారబ్బా అని సచివాలయ ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
