భద్రాచలంలో బూజు పట్టిన లడ్డూలు.. నలుగురిపై చర్యలు.. మెమోలు జారీ చేసిన ఈవో..
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన భద్రాచలం రామాలయంలో బూజు పట్టిన లడ్డూల విక్రయం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి అధికారులపై దేవాదాయ శాఖ చర్యలు తీసుకుంది.

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన భద్రాచలం రామాలయంలో బూజు పట్టిన లడ్డూల విక్రయం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి అధికారులపై దేవాదాయ శాఖ చర్యలు తీసుకుంది. నలుగురు ఆలయ అధికారులు, సిబ్బందికి ఆలయ ఈవో శివాజీ మెమోలు జారీ చేశారు. వీరిలో ఆలయ ఏఈవో శ్రవణ్ కుమార్ కూడా ఉన్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు ఆలయ ఈవో శివాజీ ఈ మెమోలు జారీ చేశారు.
ఇటీవల భద్రచాలం రామాలయంలో ప్రసాదం కొనుగోలు చేసిన పలువురు భక్తులు అవి బూజు పట్టి ఉండటం చూసి షాక్ తిన్నారు. లడ్డూల నాణ్యతను అధికారులు పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. సంబంధిత కౌంటర్‌లలో లడ్డూలను విక్రయిస్తున్నవారిని ప్రశ్నించారు. అయితే వారి నుంచి వచ్చిన సమాధానంతో తృప్తి చెందని భక్తులు బూజు పట్టిన లడ్డూలు ఇక్కడ విక్రయించబడును అని రాసిన పేపర్లను కౌంటర్ల వద్ద అంటించి నిరసన తెలిపారు.
ఈ క్రమంలోనే భక్తుల ఫిర్యాదు మేరకు భద్రాద్రి ఆలయంలో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఇక, జనవరి 2న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయ అధికారులు భక్తుల కోసం 2 లక్షల లడ్డూలను సిద్ధం చేశారు. అయితే ఆలయంలో పెద్దగా రద్దీ లేకపోవడంతో చాలా వరకు లడ్డులు మిగిలిపోయాయి. మిగిలిన లడ్డులను నిల్వ చేసే విషయంలో ఆలయ సిబ్బంది నిర్లక్ష్యం వహించినట్టుగా తెలుస్తోంది.