హైదరాబాద్ బేగంబజార్‌లో పరువు హత్య కేసుకు సంబంధించి మృతుడు నీరజ్ పన్వార్ భార్య సంజన కుటుంబ సభ్యులు స్పందించారు. నీరజ్ హత్యకు సంబంధించి వారి కుటుంబంపై వస్తున్న ఆరోపణలను సంజన తల్లి మధుబాయి ఖండించారు.
హైదరాబాద్ బేగంబజార్‌లో పరువు హత్య కేసుకు సంబంధించి మృతుడు నీరజ్ పన్వార్ భార్య సంజన కుటుంబ సభ్యులు స్పందించారు. నీరజ్ హత్యకు సంబంధించి వారి కుటుంబంపై వస్తున్న ఆరోపణలను సంజన తల్లి మధుబాయి ఖండించారు. ఈ హత్యతో తమ కుటుంబానికి సంబంధం లేదని చెప్పారు. నీరజ్‌ను ఎవరు చంపారో తమకు తెలియదని సంజన తల్లి చెప్పారు. నీరజ్‌ను హత్య చేసినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
తన కూతురు హత్య జరిగిన సమయంలో కుమారుడు, బావ కుమారులు కూడా ఇంట్లోనే ఉన్నారని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటన గురించి తెలియగానే భయంతో ఇంట్లోంచి పారిపోయారని ఆమె తెలిపారు. సంజన దంపతులు సుఖంగా ఉంటే చాలనుకున్నామని చెప్పారు. అయితే కొన్ని రోజులుగా అల్లుడు నీరజ్‌ను చంపుతామని కొందరు బెదిరస్తూ వచ్చారని, వారెవరో మాత్రం తమకు తెలియదని అన్నారు. తన కుమార్తె సంసారాన్ని నాశనం చేశారని.. తన అల్లుడిని హత్య చేసిన వాళ్లను ఉరితీయాలని డిమాండ్ చేశారు.
సంజన సోదరి మమత మాట్లాడుతూ.. ఈ హత్యతో తమ కుటుంబానికి సంబంధం లేదని చెప్పారు. ప్రేమ వివాహం ఇష్టలేకే ఏడాది పాటు సంజనతో మాట్లాడకుండా దూరంగా పెట్టామని ఆమె పేర్కొన్నారు. తన తల్లి ఆరోగ్యం బాగాలేకపోవడంతో సంజనతో రెండు మాట్లాడుతున్నట్టుగా చెప్పారు. సంజన సంతోషంగా ఉంటే చాలని అనుకున్నామని తెలిపారు.
నలుగురు అరెస్ట్..
ఈ ఘటనపై వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవిస్ మాట్లాడుతూ.. నీరజ్ హత్యకేసులో ఇప్పటికే ఐదుగురు నిందితులను గుర్తించామని చెప్పారు. సంజనకు దగ్గరి బంధువులని చెప్పారు. నిందితుల్లో నలుగురిని అదుపులోకి తీసుకున్నామని.. ఒకరు పరారీలో ఉన్నట్టుగా చెప్పారు.
మరోవైపు బేగంబజార్ కూడలిలో మృతుడు నీరజ్ భార్య sanjana రెండు నెలల వయసున్న బాబుతో ధర్నాకు దిగింది. బేగంబజార్‌లో వ్యాపారులు, నీరజ్ కుటుంబ సభ్యులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. నిందితులను ఉరి తీయాలని వారు డిమాండ్ చేశారు. తన సోదరులే హత్య చేసినట్లు సంజన ఆరోపించింది. ఏడాదిగా తన సోదరులు బెదిరిస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా తన సోదరులు వెనక్కి తగ్గలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఘటనకు సంబంధించి పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. హత్య చేసిన వారిని గుర్తు పట్టేందుకు సంజనను పోలీసులు పీఎస్ కు తీసుకువచ్చారు.
ఆందోళన విరమించిన కుటుంబ సభ్యులు..
నీరజ్ హత్య నేపథ్యంలో షాహినయత్ గంజ్ పీఎస్ ఎదుట అతని కుటుంబ సభ్యులు, బంధువులు చేపట్టిన ఆందోళనను దాదాపు గంట తర్వాత విరమించారు. ఎమ్మెల్యే రాజాసింగ్ చొరవతో కుటుంబ సభ్యులు, వ్యాపారులు ఆందోళన విరమించారు. మరోవైపు నిందితులకు చట్టపరంగా శిక్షపడేలా చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.
