మహమ్మారి కరోనా వైరస్ కు టీకాలు ప్రారంభించడం దేశానికే గర్వకారణం అని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళైసాయి సౌందరాజన్ శనివారం అన్నారు. ఫ్రంట్లైన్ వారియర్స్ కు మొదట టీకాలు వేయడం అనేది కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి చెందినప్పటి నుండి వారు చేస్తున్న నిస్వార్థ సేవలకు ఒక చిన్న గుర్తింపు అన్నారు. ముందుగా వారికి ఇంజెక్షన్ ఇచ్చినందుకు  కృతజ్ఞతలు" అని ఆమె తెలిపారు.

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఆమె భర్త ప్రఖ్యాత నెఫ్రాలజిస్ట్ డాక్టర్ పి. సౌందరరాజన్,  నిమ్స్ ఆసుపత్రిలో ఫ్రంట్‌లైన్ యోధులకు టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ తమిలిసై సౌందరరాజన్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమం ప్రారంభించటం మహమ్మారి ముగింపుకు, మన దేశ ప్రజల రక్షణ ప్రారంభానికి సంకేతం అన్నారు.

"

గతేడాది అంతా మహమ్మారి సంవత్సరం లాగా ఉందని, ఇప్పుడు ఈ నూతన సంవత్సరం రక్షణ సంవత్సరం లాంటిదని అభివర్ణించారామె. కోవిడ్ -19 నుండి ప్రజలను రక్షించడానికి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి శాస్త్రవేత్తలకు ప్రేరణ, సహకారం అందించినందుకు గవర్నర్ ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.

"మా ప్రధాన మంత్రి హైదరాబాద్ లోని జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ లాబొరేటరీని వ్యక్తిగతంగా సందర్శించారు.  కోవిడ్ -19 ను ముగించడానికి సమర్థవంతమైన వ్యాక్సిన్ తీసుకురావాలని శాస్త్రవేత్తలను ప్రేరేపించారు" అని ఆమె తెలిపారు.

మన శాస్త్రవేత్తల నిరంతర ప్రయత్నాల వల్ల మన సొంత టీకా తయారుచేసుకున్నామన్నారు. టీకా కోసం మనం వేరే దేశం మీద ఆధారపడటం లేదని గర్వపడాలని తెలిపారు. ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగానే దేశం స్వావలంబన దిశగా ప్రయాణం చేస్తే మనదైన టీకా అభివృద్ధి చేసిందని అన్నారు. 

టీకా అభివృద్ధి చేసినందుకు, మనందరికీ అందుబాటులోకి తెచ్చినందుకు మన శాస్త్రవేత్తలకు వందనం అన్నారు. ఇది మన శాస్త్రీయ సమాజం సాధించిన గొప్ప ఘనత అని, ఇది మన సైంటిస్టుల సామర్థ్యాన్ని తెలుపుతోందన్నారు. శాస్త్రవేత్తల పరిశోధన,  ఆవిష్కరణలు చూసి దేశం గర్విస్తుందన్నారు.

భారతదేశం, ముఖ్యంగా హైదరాబాద్, ప్రపంచ ఔషధ రాజధానిగా అభివృద్ధి చెందుతోందని ఆమె పేర్కొన్నారు. నిజానికి మనం 150 కి పైగా దేశాలకు మందులు సరఫరా చేస్తున్నాము. చాలా దేశాలు తమ ప్రజలను రక్షించడానికి మన టీకా సరఫరా కోసం భారతదేశం వైపు చూస్తున్నాయి.

మన ఫ్రంట్‌లైన్ యోధులకు టీకాలు వేయడం ప్రారంభించినందున త్వరలో వేరే దేశాలకు కూడా కోవిడ్ -19 వ్యాక్సిన్ ను ఎగుమతి చేయగలుగుతాం. కోవిడ్ -19 మహమ్మారికి వ్యతిరేకంగా మన పోరాటంలో ఈ రోజును ‘గుర్తుంచుకోవలసిన రోజు’ అని అన్నారు. ఈ రోజు ఫ్రంట్‌లైన్ యోధులకు మన కృతజ్ఞతలు తెలియజేసే రోజు అని డాక్టర్ తమిళైసాయి సౌందరరాజన్ అన్నారు.

వ్యాక్సిన్ల గురించి అపోహలు నమ్మొద్దని అన్నారు. భారతదేశంలో తయారుచేసిన వ్యాక్సిన్లు చాలా సురక్షితమైనవని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకోవటానికి ఎటువంటి సంకోచం పెట్టుకోవద్దని అన్నారు. టీకా తీసుకోవడానికి మనం భయపడనవసరం లేదు. ఇది సురక్షితమైన టీకా, దీని కారణంగా ఏదైనా అలెర్జీ లేదా ఇతర చిన్న సమస్యలు ఉన్నప్పటికీ, అటువంటి సమస్యలను ఎదుర్కోవటానికి ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయని తెలిపారు.

అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా, కఠినమైన భద్రతా నిబంధనల ప్రకారం వ్యాక్సిన్లు అభివృద్ధి చేయబడి, అనుమతులు క్లియర్ చేయబడినందున వ్యాక్సిన్‌ను విశ్వాసంతో తీసుకోవాలని ఆమె  విజ్ఞప్తి చేశారు.

గవర్నర్ ఎప్పుడు వ్యాక్సిన్ తీసుకుంటారు అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా  ప్రధానమంత్రి సూచనల మేరకు మొదట ప్రకారం, ఫ్రంట్లైన్ యోధులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

"రాష్ట్ర మొదటి పౌరురాలిగా, మిగతా పౌరులందరితో పాటే నేను టీకా తీసుకుంటాను" అని ఆమె తెలిపారు. అంతకుముందు, ఆమె వ్యక్తిగతంగా నిమ్స్ వద్ద టీకా గదిని సందర్శించి, మొదటి ముగ్గురు ఫ్రంట్లైన్ యోధులకు టీకా ప్రక్రియను పరిశీలించారు.

టీకా తర్వాత పువ్వులు, అప్రిషియేషన్ లెటర్స్ తో నిమ్స్‌లో తొలి టీకా షాట్లు తీసుకున్న ఫ్రంట్‌లైన్ యోధులను గవర్నర్ సత్కరించారు. 

డాక్టర్ తమిలిసాయి సౌందరాజన్ మాట్లాడుతూ మొదటి రోజు 30 మంది ఫ్రంట్‌లైన్ యోధులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 139 టీకా కేంద్రాల్లో ప్రతి ఒక్కరికి టీకా ఇస్తామని చెప్పారు. కేంద్రాల సంఖ్య క్రమంగా పెరుగుతుందని ఆమె హామీ ఇచ్చారు. టీకా ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ రక్షణ కల్పిస్తామని తెలిపారు.

టీకా పూర్తయ్యే వరకు ప్రజలు సురక్షితంగా ఉండాలని, అన్ని జాగ్రత్తలూ తప్పనిసరి పాటించాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు. డాక్టర్ తమిలిసై సౌందరాజన్ జర్నలిస్టులను అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కరోనా నివారణ నిబంధనలను పాటించాలని కోరారు, పూర్తి టీకాలు వచ్చేవరకు సురక్షితంగా ఉండటానికి, ప్రజలందరి శ్రేయస్సు కోసం ఈ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని మెచ్చుకున్నారు.