హైదరాబాద్‌లో కరోనా భయాన్ని వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. బ్యూటీ పార్లర్లను ఐసోలేషన్ సెంటర్లుగా మార్చేస్తున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి కరోనా రోగులకు గదులను అద్దెకిస్తున్నారు.

ఇందులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే పాజిటివ్ వ్యక్తులు వస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.5లో బ్యూటీ స్టూడియో కరోనా బాధితుల ఐసోలేషన్ సెంటర్‌గా మారిపోయింది. రోజుకు రూ.10 వేలు ఫీజు వసూలు చేస్తున్న నిర్వాహకులు.. ప్రభుత్వం  నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు.

దీనిని పోలీసులు సుమోటాగా తీసుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కరోనా కారణంగా నగరంలో అన్నీ మూతపడ్డాయి. ఆ తర్వాత సడలింపులు ఇచ్చినా... బ్యూటీపార్లర్లకు రావడానికి ప్రజలు అంతా మొగ్గుచూపడం లేదు.

దీంతో అందానికి మెరుగులు దిద్దే బ్యూటీని పార్లర్‌ను ఐసోలేషన్ సెంటర్‌గా మార్చేశారు. నిబంధనలను తుంగలో తొక్కి కోవిడ్ 19 రోగులకు గదులు అద్దెకు ఇస్తున్నారు. 

తెలంగాణలో కరోనా కరాళ నృత్యం కొనసాగుతోంది. ప్రజలను వైరస్ బారి నుంచి కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న వైద్యులు, పోలీసుల సైతం ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో కానిస్టేబుల్‌కు పాజిటివ్‌గా తేలింది. ఇటీవలే సదరు కానిస్టేబుల్‌కు కొడుకు పుట్టాడు.

అయితే తనకు కరోనా సోకిందన్న విషయం తెలియని అతను.. కొడుకు పుట్టిన సంతోషంలో స్వీట్లు పంచాడు. దీంతో అతని వద్ద నుంచి స్వీట్లు తిన్న 12 మందికి పాజిటివ్‌గా తేలింది. మరోవైపు కానిస్టేబుల్ సోదరుడికి కూడా వైరస్ సోకింది. దీంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.