కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి భూపేందర యాదవ్‌ను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య సారథ్యంలోని బృందం కలిసింది. కేంద్రంలో ప్రత్యేకంగా బీసీలకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కోరింది. 

న్యూఢిల్లీ: కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌ను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కలిశారు. ఆర్ కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజకృష్ణ, ఓబీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ బృందం కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌తో సమావేశం అయ్యారు. ఈ బృందం 15 బీసీ డిమాండ్ల పై పత్రాన్ని ఆయనకు సమర్పించారు. ఈ డిమాండ్లపై ప్రధాని మోడీతో చర్చించాలని కేంద్ర మంత్రిని కోరారు.

కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఆర్ కృష్ణయ్య సారథ్యంలోని బృందం విజ్ఞప్తి చేశారు. అసంఘటిత రంగ కార్మికులైన బీసీ చేతివృత్తుదారులు, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. ప్రాథమిక విద్యా స్థాయి నుంచి పదో తరగతి వరకు దేశవ్యాప్తంగా బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీని ద్వారా డ్రాప్ అవుట్ శాతం సంపూర్ణంగా తగ్గిపోతుందని అన్నారు. అంతేకాదు, వంద శాతం అక్షరాస్యత సాధన సాధ్యమవుతుందని, తద్వార ఈ నిర్ణయం దేశ ప్రగతి దోహదపడుతుందని పేర్కొన్నారు. అంతేకాదు, ఓబీసీ విద్యార్థులకు జాతీయ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ స్కీమ్ కూడా వర్తింపజేయాలని మనవి చేసుకున్నారు. 

Also Read: టీడీపీ నన్ను వాడుకొంది, ఆ పార్టీలను నేను వాడుకున్నా: ఆర్. కృష్ణయ్య సంచలనం

ఈ డిమాండ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు.ఈ డిమాండ్లపై కూలంకషంగా చర్చించి.. బీసీ సంఘాలతో ప్రధానిని సమావేశ పరచడానికి పూనుకోవాలని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ బృందంలో జాతీయ బీసీ నేతలు, ప్రముఖ లాయర్ మెట్ట చంద్రశేఖర్, ఓం ప్రకాశ్ సహా పలువురు నేతలు ఉన్నారు.