నయీం కేసు ఛార్జీషీటులో తన పేరు చేర్చడం పట్ల బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. తెలంగాణ సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వందల ఎకరాల భూములు సంపాదించుకుని, అక్రమ వ్యవహారాలు జరిపిన వారి పేర్లను పక్కనబెట్టడం రాజకీయ దురుద్దేశ్యమన్నారు.

నయీం దగ్గర తాను ఒక్క ఎకరం భూమిని తీసుకోలేదని, ఆయన వర్సిటీలో చదువుకునే సమయంలో తన దగ్గర ఉద్యమాలలో పాల్గొనేవాడని కృష్ణయ్య తె లిపారు. నయీం బాధితులు అనేక మంది న్యాయం చేయాల్సిందిగా తన వద్దకు వచ్చేవారని తాను వెంటనే ఫోన్ చేసి మందలించేవాడినని ఆయన గుర్తు చేశారు.

తనకు నయీంతో ఎలాంటి సంబంధం లేదని.. కేవలం అతని బాధితుల పక్షాన మాట్లాడనన్నారు. తాను 40 ఏళ్ల నుంచి ఉద్యమాలు చేస్తున్నానని.. 1982లోనే ఎన్టీఆర్ తనకు టికెట్ ఇచ్చి, మంత్రి పదవిని ఇస్తానన్నారని కానీ తాను బీసీల సంక్షేమం కోసమే పోరాడనన్నారు.

ప్రజల తరపున పోరాడుతున్న నేతలను గతంలో వున్న ముఖ్యమంత్రులందరూ పాజిటివ్‌గా తీసుకున్నారని.. తనను వారందరూ గౌరవించారని కృష్ణయ్య తెలిపారు. నయీంతో సంబంధాలున్న టీఆర్ఎస్, ఇతర పార్టీ నేతలతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పేర్లను పక్కనబెట్టి తనలాంటి వారి పేర్లను ఛార్జీషీట్‌లో పెట్టడంపై కృష్ణయ్య మండిపడ్డారు.

భూములు లాక్కొని దందాలు చేసిన నేతలు కళ్లెదుట కనిపిస్తున్నా వదిలేశారని ఆయన ధ్వజమెత్తారు. నయీం కేసును సీబీఐకి అప్పగించి.. వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నయీం ఎన్‌కౌంటర్ తర్వాత దొరికిన కోట్లాది రూపాయల డబ్బు, భూములను బాధితులకు ఇవ్వాలని కోరారు.